తన బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసిన కస్టమర్లకు ఎస్భీఐ తీపి కబురు చెప్పింది. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) వడ్డీ రేట్లను పెంచిన తర్వాత చాలా బ్యాంకులు లోన్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. కొన్ని బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. తాజాగా దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్‌బీఐ కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్ల(ఎఫ్‌డీ)పై వడ్డీ రేట్లను పెంచబోతుంది. బ్యాంకు మరోసారి ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను పెంచనుందని ఎస్‌బీఐ ఛైర్మన్ దినేష్ కుమార్ ఖారా చెప్పారు. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచిన తర్వాత.. ఎస్‌బీఐ చీఫ్ ఈ ప్రకటన విడుదల చేశారు. ఎస్‌బీఐ ఇప్పటికే ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను పెంచింది. ఇప్పుడు ఆర్‌బీఐ రెపో రేటును పెంచడంతో.. మరోమారు ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను పెంచేందుకు సిద్ధమైంది.
గత నెలలో ఎస్‌బీఐ రూ.2 కోట్లు లేదా ఆపైన ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. ఎస్‌బీఐ వెబ్‌సైట్ ప్రకారం, 3 నుంచి 5, 5 నుంచి 10 ఏళ్లు టెన్యూర్ కలిగిన రూ.2 కోట్ల నుంచి ఆపైన ఉన్న ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను 90 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. ప్రస్తుతం ఎస్‌బీఐ కస్టమర్లు 12 నెలల నుంచి 24 నెలల మధ్యలో ఎఫ్‌డీలను తెరిస్తే 5.10 శాతం వడ్డీ లభిస్తుంది. అలాగే మూడేళ్ల నుంచి ఐదేళ్ల మధ్యలో ఎఫ్‌డీలను తెరిస్తే.. 5.45 శాతం వడ్డీ పొందుతున్నారు. ఈ బ్యాంకులో ఎఫ్‌డీలు తెరవాలనుకునే వారికి ఇది గుడ్‌న్యూస్.
అయితే రెపో రేటు పెరగడం చాలా మంది రుణ గ్రహీతలకు బ్యాడ్‌న్యూస్‌గా మారింది. రెపో రేటు పెరిగిన తర్వాత.. చాలా బ్యాంకులు లోన్లపై కూడా వడ్డీలను పెంచుతున్నాయి. రుణాలు తీసుకునే, తీసుకున్న కస్టమర్లకు ఈఎంఐలు భారంగా మారుతున్నాయి. వేరియబుల్ ఇంటరస్ట్ రేటు బెంచ్‌మార్క్‌లతో లింకైన లోన్ కాంట్రాక్టుల వడ్డీ రేట్లు కూడా పెరగనున్నాయని దినేష్ ఖారా చెప్పారు. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్(యూపీఐ) అకౌంట్లతో క్రెడిట్ కార్డులను లింక్ చేసుకునే అవకాశాన్ని ఆర్‌బీఐ కల్పించడం స్వాగతించదగ్గ విషయమని దినేష్ ఖారా అన్నారు. రూపే క్రెడిట్ కార్డులతో ప్రస్తుతం ఈ ప్రక్రియను ఆర్‌బీఐ ప్రారంభించబోతుంది.