మూత్రపిండాలు మనిషి అవయవాల్లో ముఖ్యమైన అవయవాలు. జీవి మనుగడకి మెదడు , గుండె , మూత్రపిండాలు ప్రధానమైనవి . జీవి చేసే కార్యకలాపాలన్నిటిని నియంత్రించేది మెదడు. శరీరం మొత్తం రక్తాన్ని ప్రసరింప జేసే పంపు వంటి సాధనం గుండె. రక్తంలో చేరుతున్న కల్మషాన్ని గుర్తించి , వడపోసి, శుభ్రం చేసే పని మూత్రపిండాలది. ఈ మూత్రపిండాలు నిరంతరం పనిచేసి రక్తాన్ని శుభ్రంగా ఉంచుతాయి. రక్తంలో ఎక్కువున్న నీటినీ, విషతుల్యాలనూ ఎప్పటికప్పుడు వడకట్టే పని చేస్తూ ఉంటాయి. ఒక రోజులో మన మూత్రపిండాలు దాదాపు 200 లీటర్ల రక్తాన్ని వడకడతాయని నిపుణుల అంచనా . ఇవి ఒంట్లో నీరు-లవణాల సమతుల్యత దెబ్బతినకుండా చూస్తుంటాయి. రక్తపు పోటు ని నియంత్రించటంలో కూడా ముఖ్య పాత్ర వహిస్తాయి.మన మూత్రపిండాలు ప్రతి రోజూ దరిదాపు 200 లీటర్ల రక్తాన్ని వడకట్టి అందులోనుండి దాదాపు 2 లీటర్ల కల్మషాలనీ, అధికంగా ఉన్న నీటినీ తోడెస్తాయి. ఇలా తోడెయ్యబడ్డ నీరే మూత్రంగా బయటికి వస్తాయి . ఈ మూత్రం, ఇరవైనాలుగు గంటలు, అహర్నిశలూ అలా బొట్లు బొట్లుగా మూత్రపిండాలలో ఉత్పత్తి అవుతూనే ఉంటుంది. ఇలా తయారయున బొట్లు యూరెటర్ అనే పేరు గల రెండు గొట్టాల ద్వారా మూత్రాశయంలోకి చేరతాయి. ఈ సంచీ నిండగానే మూత్ర విసర్జన చెయ్యాలనే కోరిక మెదడులో కలుగుతుంది. ఈ యూరెటర్లు సుమారు 0.6 సెంటీమీటర్లు వ్యాసం గల గొట్టాలు. ఈ గొట్టాల గోడలలో ఉన్న కండరాలు తరంగాల మాదిరి ముకుళించుకుని వికసిస్తూ ఉంటే వీటిలో ఉన్న మూత్రపు బొట్లు మూత్రాశయం వైపు నెట్టబడతాయి . మూత్రాశయంలోకి చేరుకున్న మూత్రం మళ్ళి వెనక్కి వెళ్ళకుండా ఈ కండరాలే అడ్డుకుంటాయి. కనుక మూత్రాశయంలో పెరుగుతూన్న మూత్రానికి ఒకటే దారి - బయటకి పోవడమే . మూత్రాశయం నుండి బయటకి వెళ్ళే గొట్టం పేరు యూరెత్రా . ఇది పురుషాంగం మధ్య నుండి కాని, యోని ద్వారం దగ్గరకి కాని బయటకి వస్తుంది. ఇలా బయటకి వెళ్ళే మార్గాన్ని మూత్రమార్గం అని కూడా అంటారు.
దెబ్బలు తగలటం , మూత్రపిండాల ఆరోగ్య భంగానికి ముఖ్య కారకులు మితిమీరిన రక్తపు పోటు , అదుపు తప్పిన రక్తపు చక్కెర మట్టం , కొన్ని రోగాలను సంబంధించి వాడె మందుల వల్ల మూత్రపిండాలు దెబ్బతినే అవకాశం కలదు . కనుక మూత్రపిండాల పరీక్ష చేపించాలి అనుకుంటే ముందు రక్తపు పోటుని అదుపులో పెట్టాలి. ఆ తరువాత డయబెటీస్ రాకుండా జాగ్రత్త పడాలి. వీటి అవతరణకి వంశ పారాపర్యం కారణాలు కొంతవరకు అయినా, మంచి అలవాట్లతో వీటిని నియంత్రించవచ్చు. ఈ మంచి అలవాట్లలో ముఖ్యమైనవి: ప్రతి దినం చలాకీ జీవితం గడపటం, శరీరం బరువుని అదుపులో పెట్టుకోవటం, పొగతాగుడు మానటం, ఆరోగ్యకరమైన తిండి తినటం.
నిరంతరం పని చెయ్యడం వలన , వీటి పని సామర్ధ్యత కొన్నేళ్ళకి తగ్గడం అనేది జరుగుతుంది . అందువలన వీటిని శుభ్రం చేసే ఆహరం తీసుకోవడం అనేది చాల మంచిది . వాటిలో ప్రధానంగా , ఒక కొత్తిమీర తీసుకుని, ఆకులను శుభ్రంగా కడగాలి. తర్వాత సన్నగా తరిగి, ఒక గిన్నె నీళ్లలో వేసి, కొన్ని నిమిషాల పాటు మరగపెట్టాలి . చల్లారిన తర్వాత వడగట్టి సీసాలో నింపి ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవాలి. ఈ నీటిని ప్రతి రోజూ తాగుతూ ఉంటే, మూత్రపిండాలు శుభ్రపడతాయి. దీని వలన శరీరం తేలికవడంతో పాటు, చలాకీగా తయారవుతుంది. మలబద్ధకం వదిలిపోతుంది.