ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉగ్రవాదంపై...భారత్, అమెరికా తీర్మానాలు..మెకాలడ్డిన చైనా

international |  Suryaa Desk  | Published : Sat, Jun 18, 2022, 01:29 AM

సందర్భం వచ్చినపుడుల్లా భారత్ కు వ్యతిరేకంగా పాకిస్తాన్ కు మద్దతుగా నిలుస్తున్న చైనా దేశం మరోసారి తన కుట్టిల నీతిని ప్రదర్శించింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని ఐఎస్‌, అల్ ఖైదా ఆంక్షల కమిటీ కింద పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్ మక్కీని ‘అంతర్జాతీయ తీవ్రవాది’గా గుర్తించాలని కోరుతూ ఐరాసలో భారత్, అమెరికా సంయుక్త ప్రతిపాదనకు చైనా చివరి నిమిషంలో అడ్డుపడింది. లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థ అధినేత, 26/11 దాడుల మాస్టర్ మైండ్ హఫీజ్ సయీద్‌కు మక్కీ స్వయాన బావ మరిది. మక్కీని ఇప్పటికే ఉగ్రవాదిగా అమెరికా గుర్తించింది. అయితే, ఐరాసలో పాకిస్థాన్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా భారత్ తీసుకొచ్చిన తీర్మానాలకు చైనా మోకాలడ్డటం ఇదే తొలిసారి కాదు.


2019 మే నెలలో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని భద్రతా మండలిలో భారత్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని కూడా డ్రాగన్ అడ్డుకుంది. కానీ, భారత్ ఆ సమయంలో దౌత్యనీతిని ప్రదర్శించి విజయం సాధించింది. భద్రతా మండలిలో వీటో అధికారం కలిగిన చైనా.. మసూద్ అజార్‌ను బ్లాక్ లిస్ట్‌లో చేర్చే ప్రయత్నంలో పాక్‌కు వంతపాడింది. సాంకేతిక కారణంతో ప్రయత్నాలను అడ్డుకుంది. 2009లో మసూద్ అజార్‌ను బ్లాక్ లిస్ట్‌ చేర్చాలని భారత్ స్వయంగా ప్రతిపాదన చేసింది.


జనవరి 2016లో పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరంపై దాడికి ప్రధాన సూత్రధారి అయిన మసూద్ అజార్‌ను నిషేధించాలని అమెరికా, యూకే, ఫ్రాన్స్‌లతో కలిసి ఐరాస 1267 ఆంక్షల కమిటీకి ప్రతిపాదనను పంపింది. 2017లో మళ్లీ ఇదే ప్రతిపాదనను చేయగా.. అన్ని సందర్భాల్లో వీటో అధికారంతో భారత ప్రతిపాదనను ఆంక్షల కమిటీ ఆమోదించకుండా చైనా అడ్డుకుంది. మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఒత్తిడిని కొనసాగిస్తూ.. ఫ్రాన్స్, బ్రిటన్ మద్దతుతో అమెరికా నేరుగా భద్రతా మండలిలో తీర్మానం చేసింది.


అబుద్ల్ రెహ్మాన్ మక్కీని 2010 నవంబరులో అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తిస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. దీంతో మక్కీకి చెందిన అమెరికా పరిధిలోని ఆస్తులను స్తంభించడమే కాదు, తమదేశానికి చెందిన వ్యక్తులు అతడితో ఎటువంటి వ్యవహారాలు జరపకుండా నిషేధం అమల్లోకి వచ్చింది. అలాగే, లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థకు మద్దతు, వనరులను ఉద్దేశపూర్వకంగా అందించడం లేదా అందించే ప్రయత్నం చేయడం నేరమని అమెరికా తెలిపింది.


మక్కీ గురించి సమాచారం ఇస్తే 2 మిలియన్ డాలర్లు రివార్డును అందజేస్తామని ప్రకటించింది. ‘‘అమెరికా గుర్తించిన విదేశీ ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబాలో కీలకమైన వ్యక్తిగా ఉన్న మక్కీ.. ఉగ్రవాద కార్యకలాపాల కోసం నిధులు సేకరించాడు.. ఉగ్రవాద కార్యకలపాలకు నిధులు సేకరించినట్ట 2020లో పాకిస్థాన్ ఉగ్రవాద నిరోధక కోర్టు నిర్ధారించి శిక్ష ఖరారు చేసింది.. పాకిస్థాన్ న్యాయవ్యవస్థ గతంలో దోషులుగా ఉన్న లష్కరే తొయిబా నాయకులు, ఉగ్రవాదులను విడుదల చేయడంతో మక్కీ గురించి సమాచారాన్ని అమెరికా కోరుతూనే ఉంది’’ అని పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com