ప్రపంచంలోని అన్ని దేశాలూ నీటి కాలుష్యంపై మాట్లాడుతున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కానీ చేతల్లో ఏమీ చెయ్యట్లేదనే విమర్శలున్నాయి. ఫలితంగానే ఏటా సముద్రాల్లో విపరీతంగా చెత్త పెరుగుతోంది. ఎక్కడిదాకో ఎందుకు వైజాగ్‌లోని రుషికొండ బీచ్ ఒకప్పుడు ఎంతో అందంగా ఉండేది. ఇప్పుడు అక్కడి అలలను గమనిస్తే... వాటిలో ప్లాస్టిక్ వ్యర్థాలు తీరానికి వస్తున్న దృశ్యాలు కనిపిస్తాయి. నానాటికీ ఆ చెత్త పెరుగుతూనే ఉంది. ఇలా చాలా తీరప్రాంతాలు కలుషితం అవుతూనే ఉన్నాయి.
ఉత్తర, దక్షిణ అమెరికాల మధ్యలో ఉంటుంది గ్వాటెమాల దేశం. ఆ దేశానికి భారీ తీర ప్రాంతం ఉంది. ఇప్పుడు ఆ తీర ప్రాంతం అత్యంత విషపూరితం, కలుషితం అయిపోయింది. కారణం ఓ నది. ఆ నది అత్యంత కలుషితమైనది. ఇన్నాళ్లూ దాని కాలుష్యం... సముద్రంలో కలవకుండా చేశారు. కానీ ఇప్పుడా గట్టు తెగిపోయింది. ఒక్కసారిగా ప్లాస్టిక్ వ్యర్థాలు, వాటర్ బాటిళ్లు, ప్లాస్టిక్ కవర్లు, కుళ్లిపోయిన చెత్తా చెదారం అంతా... గ్వాటెమాల సముద్ర తీరాల్లోకి వచ్చేసింది. చూస్తే అక్కడ సముద్రం కనిపించట్లేదు. మొత్తం చెత్తే కనిపిస్తోంది. అలలు కూడా చెత్తలోనే వస్తున్నాయంటే.. పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
దీనికి సంబంధించిన వీడియోని 4ocean అనే కంపెనీ టిక్‌టాక్‌లో పోస్ట్ చెయ్యగానే... దాన్ని కోటి మందికి పైగా చూశారు. 5 లక్షల మందికి పైగా లైక్ చేసి.. ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కంపెనీ బ్రాస్‌లెట్స్, డ్రింక్‌వేర్, బట్టలు తయారుచేస్తుంది. ఇది పర్యావరణానికి మేలు చేసే పనులు చేస్తోంది. ఈ కంపెనీ.. తాను అమ్మే ప్రతీ ఉత్పత్తికీ... అరకేజీ చెత్తను సముద్రాలు, నదులు, చెరువుల నుంచి తొలగిస్తానని హామీ ఇచ్చింది. కానీ తొలగించలేనంత చెత్త రోజూ పెరుగుతోంది.
రియో మొటాగ్వా నది.. గ్వాటెమాలకు పశ్చిమంవైపు నుంచి తూర్పు వైపుకి... 485 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తోంది. ఈ నది నుంచి ఈ చెత్తంతా సముద్రంలోకి వెళ్లింది. మొత్తం 11 మిలియన్ మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఏటా ఈ నది నుంచి సముద్రంలోకి వెళ్తున్నట్లు అంచనా ఉంది. 2040 నాటికి ఈ చెత్త మూడు రెట్లు ఎక్కువగా వెళ్తుందని అంటున్నారు.
ప్రపంచంలో సముద్రాల్లోకి వెళ్తున్న ప్లాస్టిక్ వ్యర్థాల్లో 2 శాతం రియో మొటాగ్వా నది ద్వారా వెళ్తున్నాయి. ఏటా 22,000 టన్నుల ప్లాస్టిక్ ఆ నది నుంచి సముద్రంలో కలుస్తోంది. ప్రజలంతా ఆ నదిలోనే చెత్తను పారేస్తున్నారు. అది సముద్రంలో కలుస్తోంది. ప్రపంచ దేశాలు మాటలకే పరిమితం అయినంతకాలం... మహా సముద్రాలు కుళ్లిపోతూనే ఉంటాయి. భవిష్యత్తు మరింత దారుణంగా ఉండటం ఖాయం. ఈ దేశాలు ఆయుధాలు అమ్ముకోవడంపై చూపే శ్రద్ధను పర్యావరణ రక్షణపై చూపితే బాగుంటుందనే విమర్శలు పర్యావరణ వేత్తల నుంచి వస్తున్నాయి.