వచ్చే ఎన్నికల్లో తమను నమ్మాలంటే దేశంలోని విపక్షాలన్నీ కలసి రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థులను నిలపాలని శివసేన అభిప్రాయపడింది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఒక బలమైన అభ్యర్థిని విపక్షాలు నిలబెట్టలేకపోతే ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని శివసేన తెలిపింది. రాష్ట్రపతి అభ్యర్థిని నిలబెట్టలేని వాళ్లు ఒక సమర్థవంతమైన ప్రధాని అభ్యర్థిని ఎలా నిలబెట్టగలరని ప్రజలు ప్రశ్నిస్తారని వ్యాఖ్యానించింది. ఈ మేరకు తన అధికారిక పత్రిక సామ్నాలో ఎడిటోరియల్ ను ప్రచురించింది. రాష్ట్రపతి ఎన్నికలు వచ్చినప్పుడల్లా మహాత్మాగాంధీ మనవడు గోపాల్ కృష్ణ గాంధీ, ఫరూక్ అబ్దుల్లాల పేర్లను విపక్షాలు తెరపైకి తెస్తాయని కానీ, ఎన్నికల్లో బలమైన పోటీని మాత్రం సృష్టించలేకపోతున్నాయని వ్యాఖ్యానించింది.
ఇదే సమయంలో బీజేపీ నేతృత్వంలోని అధికార కూటమి కూడా సరైన అభ్యర్థిని ప్రకటించలేకపోతోందని శివసేన వ్యాఖ్యానించింది. ఐదేళ్ల క్రితం ఇద్దరు, ముగ్గురు పేర్లను షార్ట్ లిస్ట్ చేసి రామ్ నాథ్ కోవింద్ పేరును బీజేపీ ప్రకటించిందని... ఇప్పుడు కూడా అదే చేస్తుందని చెప్పింది.