తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ముందు ఏ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉండి తాను ఎన్టీఆర్‌పై పోటీ చేసి గెలుస్తానని ప్రగల్బాలు పలికి, ఓడిపోయి మళ్లీ ఎన్టీఆర్‌ను బతిమిలాడుకుని తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీలో ఉండి పార్టీలోని వాళ్లందర్ని మెల్లగా దగ్గరకు చేర్చుకుని, ఆ పార్టీనే కబ్జా చేసిన మనిషి చంద్రబాబు నాయుడు. కబ్జాలు చేయడం, చేయించడం చంద్రబాబు నైజం. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని, సింబల్‌తో పాటు, ట్రస్టును, ఎన్టీఆర్ బ్యాంక్ బ్యాలెన్స్‌ను లాక్కున్న చరిత్ర బాబుది , టీడీపీని కబ్జా చేసిన చంద్రబాబే కబ్జాలకు ఆద్యుడని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు విమర్శించారు. అలాంటి కబ్జాల చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆ పార్టీ నాయకులు కబ్జాకోర్లు కాకుండా ఎవరు అవుతారు...? ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడు కబ్జా చేసిన స్థలంలో నిర్మించిన ప్రహరీ గోడను తొలగించడంలో చట్టం తన పని తాను చేసుకుపోతోంది. నిబంధనలు అతిక్రమిస్తే ఎవరైనా చట్టానికి అతీతులు కారు. చట్టం దృష్టిలో అందరూ సమానులేనని హెచ్చరించారు. ఆదివారం తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు.