అమ్మాయిలు అందంగా కనిపించడానికి రకరకాల క్రీములు వాడ్డం, సహజమైన పద్ధతులు ఫాలో అవుతుంటారు. కాలానుగుణంగా కూడా చర్మ సౌందర్యం కోసం, ముఖ వర్ఛస్సు కోసం తపన పడుతుంటారు. అందాన్ని పెంచడానికి జెల్స్ కూడా చాలా యూజ్ అవుతాయి. చలికాలంలో చర్మానికి తేమ చాలా అవసరం. అందుకే అందరూ పెట్రోలియం జెల్లీని వాడుతుంటారు. చర్మం ఆరోగ్యంగా ఉండడానికే కాదు.. అందాన్ని కాపాడ్డానికి రకరకాల జెల్స్ అందుబాటులో ఉన్నాయి. అవి చాలా ఉపయోగపడతాయి. ముఖంలో మంచి లుక్ రావాలంటే.. కళ్లు ఎట్రాక్ట్‌గా ఉండాలి. ముందు కనురెప్పలు బాగుండాలి. అందుకోసం రోజూ రాత్రి పడుకునే ముందు కాస్తంత కొబ్బరి నూనెలో పెట్రోలియం జెల్లీ కలిపి రెప్పలకు రాసుకుంటే ఒత్తుగా పెరుగుతాయి. అలాగే కనుబొమలు చక్కగా, కుదురుగా ఉండేలా కనిపించాలంటే ఐ బ్రో జెల్‌ను రాయాలి. పెదవులు మృదువుగా ఉండాలనుకుంటే నిద్రకు ముందు తప్పని సరిగా దీన్ని పెదవులకు పట్టించాలి. అప్పుడే అవి తేమతో, ఆరోగ్యంగా, అందంగా కూడా ఉంటాయి. పెదాలకే కాదు పాదాలకు కూడా దీనిని అప్లై చేసుకోవచ్చు. రోజూ నిద్రపోయే ముందు దీన్ని కాళ్లకు పట్టిస్తే పొడి బారకుండా మృదువుగా మారతాయి.
అదేవిధంగా బ్లాక్ హెడ్స్ తొలగించడానికి అవి ఉన్న చోట పెట్రోలియం జెల్లీని కాస్త ఎక్కువగా రాసి మందమైన పొరలా చేయాలి. ఆ తర్వాత తీసేయాలి. దాంతో బ్లాక్ హెడ్స్ సమస్య దూరం అవుతుంది. కొంచెం పెట్రోలియం జెల్లీ తీసుకుని గోళ్లపై మృదువుగా రాస్తుండాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే గోళ్లు అందంగా, ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాదు కళ్లు, పెదాలపై మేకప్‌ను తొలగించడానికి దీన్ని వాడుకోవచ్చు.