ప్రజాప్రతినిధులు తమ భాద్యతను విస్మరించి నడుచుకొంటున్నారు. పదిమందికి ఆదర‌్శంగా నిలవాల్సిన వారే తప్పులు చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య నియోజకవర్గ ఎమ్మెల్యే, జేడీఎస్ పార్టీకి చెందిన ఎం.శ్రీనివాస్ మాండ్యలోని నల్వాడి కృష్ణ రాజా వడయార్ ఐటీఐ కళాశాలను ఈనెల 20న సందర్శించారు. నైపుణ్య అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన అక్కడ కంప్యూటర్ ల్యాబ్‌కు సంబంధించి జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు.
ఇదిలావుంటే విద్యార్థులు తప్పు చేస్తే గురువులు దండించడం సహజం. అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకపోతే ఉపాధ్యాయులు చెంప దెబ్బకొడుతుంటారు. కానీ, తాను అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేదని జేడీఎస్ ఎమ్మెల్యే.. కళాశాల ప్రిన్సిపాల్‌ను కొట్టి విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ ఘటన కర్ణాటకలోని మాండ్యలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ క్రమంలో తన ప్రశ్నలకు ప్రిన్సిపాల్ నాగనాథ్ సరైన సమాధానాలు ఇవ్వడం లేదని ఎమ్మెల్యే కోపం తెచ్చుకున్నారు. అంతే.. కళాశాల సిబ్బంది, ప్రజల ముందే సదరు ప్రిన్సిపాల్‌ను చెంప దెబ్బలు కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎమ్మెల్యే తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కర్ణాటకలోని ఉద్యోగ సంఘాలు ఎమ్మెల్యేపైన ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పాఠాలు చెప్పే గురువుపై కళాశాలలోనే దాడి చేసిన ఎమ్మెల్యేపై ప్రజలు, నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.