ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డీహెచ్ఎఫ్ఎల్‌ పై కేసు నమోదు చేసిన సీబీఐ

Crime |  Suryaa Desk  | Published : Wed, Jun 22, 2022, 11:58 PM

యూబీఐకి ఓ బడా సంస్థ టోపి పెట్టింది. పెద్ద మొత్తంలో రుణం తీసుకొని చెల్లించడం మానేసింది. దీంతో మోసం చేసిన డీహెచ్ఎఫ్ఎల్‌పై సీబీఐ అధికార్లు కేసు నమోదు చేశారు. వివరాలలోకి వెళ్లితే..బ్యాంకుల‌ను బురిడీ కొట్టిస్తున్న వ్యాపార సంస్థ‌ల జాబితాలో మ‌రో పెద్ద సంస్థ చేరిపోయింది. దేశంలో బ్యాంకుల‌ను మోస‌గించిన కేసుల‌కు సంబంధించి సీబీఐ న‌మోదు చేసిన కేసుల్లో అతి పెద్ద‌ కేసుగా దీనిని ప‌రిగ‌ణిస్తున్నారు. ఈ కేసులో ప్ర‌ముఖ రియ‌ల్టీ సంస్థ దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (డీహెచ్ఎఫ్ఎల్‌)పై బుధ‌వారం కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ సీబీఐ కేసు న‌మోదు చేసింది. డీహెచ్ఎఫ్ఎల్‌తో పాటు ఆ సంస్థ మాజీ ప్ర‌మోట‌ర్లు క‌పిల్ వాద్వాన్‌, ధీర‌జ్ వాద్వాన్‌లపై కేసు నమోదు చేసింది. అంతేకాకుండా ఈ మోసంలో భాగం ఉంద‌న్న ఆరోప‌ణ‌ల‌తో అమ‌రిల్లీస్ రియ‌ల్ట‌ర్స్‌కు చెందిన సుధాక‌ర్ శెట్టితో పాటు మ‌రో ఆరుగురు బిల్డ‌ర్ల‌పైనా సీబీఐ కేసులు న‌మోదు చేసింది.


ప్ర‌భుత్వ రంగ బ్యాంకు యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) నేతృత్వంలోని 17 బ్యాంకుల క‌న్సార్టియం నుంచి 2010 నుంచి 2018 వ‌ర‌కు విడ‌త‌ల వారీగా డీహెచ్ఎల్ఎఫ్ రూ.42,871 కోట్ల‌ను రుణాలుగా తీసుకుంది. అందులో కొంత మొత్తాన్ని చెల్లించిన ఆ సంస్థ ఇంకా బ్యాంకుల క‌న్సార్టియానికి రూ.34,615 కోట్లు బ‌కాయి ఉంది. 2019 నుంచి బ‌కాయిల‌ను చెల్లించ‌డం మానేసిన‌ డీహెచ్ఎఫ్ఎల్‌పై సీబీఐ అధికారుల‌కు యూబీఐ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన సీబీఐ బుధ‌వారం ముంబైలోని సంస్థ కార్యాల‌యాల‌తో పాటు ప‌లు చోట్ల సోదాలు చేప‌ట్టింది. 


ఈ వ్య‌వ‌హారంపై ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలోనే సీబీఐ అధికారుల‌కు యూబీఐ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై కాస్తంత లోతుగా ద‌ర్యాప్తు చేసిన సీబీఐ.. డీహెచ్ఎఫ్ఎల్ అక్ర‌మాల‌కు పాల్ప‌డింద‌న్న ప్రాథ‌మిక నిర్ధార‌ణ‌తో కేసులు న‌మోదు చేసింది. యూబీఐ జ‌రిపిన ఆడిట్‌లో భాగంగా డీహెచ్ఎఫ్ఎల్ భారీ అక్ర‌మాల‌కు పాల్ప‌డింద‌ని, రుణాలుగా తీసుకున్న నిధుల‌ను దారి మ‌ళ్లించింద‌ని తేలింది. ఇదిలా ఉంటే... యెస్ బ్యాంకు రుణాల ఎగ‌వేత కేసులో డిహెచ్ఎఫ్ఎల్ మాజీ ప్ర‌మోటర్లు ఇద్ద‌రూ ప్ర‌స్తుతం జైల్లో ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com