రెబెల్ నేతలను నయానోభయానో వెనక్కి రప్పించాలని భావిస్తున్న సీఎం ఉద్ధవ్ థాకరే వర్గానికి ప్రస్తుత పరిణామం ఏమాత్రం మింగుడు పడటం లేదు. శివసేన రెబల్ వర్గం మరింత బలపడుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర రాజకీయాలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. రెబెల్ మంత్రి ఏక్ నాథ్ షిండే వర్గంలో చేరిన మంత్రులు 24 గంటల్లో పదవులు కోల్పోతారని శివసేన అధినాయకత్వం హెచ్చరించిన మరుసటిరోజే అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ఉన్నత, సాంకేతిక విద్యాశాఖ మంత్రి ఉదయ్ సామంత్ కూడా ఏక్ నాథ్ షిండే వర్గంలో చేరేందుకు గువాహటి పయనమయ్యారు.
కొన్నిరోజులుగా ముంబయిలోనే ఉన్న ఉదయ్ సామంత్ సూరత్ వెళ్లి, అక్కడ్నించి గువాహటి విమానం ఎక్కినట్టు తెలుస్తోంది. కాగా, షిండే వర్గంలో చేరిన రెబెల్ మంత్రుల్లో సామంత్ 8వ వాడు. షిండే వర్గంలో ప్రస్తుతం 40 మందికి పైగా ఎమ్మెల్యేలు ఉన్నారు. వారందరూ గువాహటిలోని రాడిసన్ బ్లూ హోటల్లో మకాం వేశారు.