తిరుపతి ప్లీనరీ నిర్వహణకు ప్రత్యేక కమిటీలను నియమించామని పార్టీ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చెప్పారు. ఈ ప్లీనరీకి 15 వేల మంది వస్తున్నట్టు తెలిపారు. వర్షం పడినా ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఉండేందుకు జర్మన్ షెడ్లను నిర్మించామన్నారు. తిరుపతి నగరం ఎస్వీయూ స్టేడియంలో మంగళవారం జరగనున్న ప్లీనరీకి సంబంధించిన ఏర్పాట్లను సోమవారం ఆయన పర్యవేక్షించారు. అనంతరం చెవిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ..... పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు, సూచనల మేరకు జిల్లా ప్లీనరీని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామన్నారు. 26 జిల్లాల్లో తొలి జిల్లా సమావేశం తిరుపతిలోనే నిర్వహిస్తున్నందున భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్‌లు, చైర్మన్‌లు, పార్టీ నియోజకవర్గ, మండల ఇన్‌చార్జ్‌లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పార్టీ అన్ని అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, పార్టీ కార్యకర్తలు పాల్గొంటున్నట్టు తెలిపారు.