శ్రీకాకుళం జిల్లా, సింగుపురం పంచాయతీ, మామిడివలసలో గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని శనివారం ఉదయం నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ..... "సంక్షేమం, అభివృద్ధి రంగాలలో వచ్చిన మార్పులను గమనించాలి. ఇది వరకూ మీ గ్రామాన ఉన్న పాఠశాల ఎలా ఉండేది..ఇప్పుడెలా ఉంది..? అదేవిధంగా ఆర్బీకేలు, వెల్నెస్ సెంటర్లు, గ్రామ సచివాలయాలు వీటి ఏర్పాటు, పనితీరు ఇవన్నీ అభివృద్ధిలో భాగమే కదా ! అభివృద్ధి లేదు అని చెప్పడం భావ్యం కాదు. అటువంటి విపక్ష విమర్శలను తిప్పికొట్టండి. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటున్నాం. అవినీతి రహిత పాలన అందిస్తున్నాం. రైతుకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా పథకం అమల్లో భాగంగా ఏడాదికి 13వేల 500 రూపాయలు అందిస్తున్నాం. ఈ డబ్బులు నేరుగా వారి ఖాతాల్లోకే జమ చేస్తున్నాం. ఈ పథకం అనేకాదు ప్రతి పథకం అమలు విషయమై కానీ వర్తింపు చేసే పద్ధతిలో కానీ అవినీతికి తావులేదు. లంచ గొండితనానికి ఆస్కారం లేదు. ఇది కాదా మార్పు ? వీటిని మీరు గుర్తించాలి. కరోనా మహమ్మారి విజృంభించిన వేళ కూడా ఏ ఒక్కరికీ ఆకలి అన్నది లేకుండా నిరాటంకంగా నిత్యావసర సరకులు ఇళ్ల వద్దకే తెచ్చి అందించగలిగాం. ఆ విషయాన్ని మీరు మరిచిపోకూడదు. దేశంలో ఎక్కడా ఈ విధంగా జరగలేదు. దీని కోసం మీరంతా ఒక్కసారి ఆలోచించాలి అని విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే ... పుట్టినప్పటి నుంచి పెద్ద చదువులు చదివి ఉద్యోగాల్లో స్థిరపడేంత వరకూ అన్ని బాధ్యతలూ ప్రభుత్వమే తీసుకుంటోంది" అని చెప్పారు.