ప్రపంచ కుబేరుల సంపద 2022 ఆరంభం నుంచి కొద్ది కొద్దిగా కరిగిపోతోంది. పెరిగిపోయిన ద్రవ్యోల్బణం, పెరుగుతున్న వడ్డీ రేట్లు, పడిపోతున్న ఆర్థిక వృద్ధి.. వీటన్నింటి ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడిలోకి వెళ్లాయి. అమెరికా మార్కెట్లు గరిష్ఠాల నుంచి ఇప్పటికే 40 శాతానికి పైగా పడిపోయాయి. మన ఈక్విటీ మార్కెట్లు గరిష్ఠాల నుంచి సుమారు 18 శాతం వరకు పతనాన్ని చూశాయి.
దీంతో కుబేరుల సంపద కూడా క్రమంగా కరిగిపోతోంది. ఈ క్రమంలోనే టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ సంపద 62 బిలియన్ డాలర్లు, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ సంపద 63 బిలియన్ డాలర్లు తరిగిపోగా.. ఫేస్ బుక్ (మెటా) చీఫ్ మార్క్ జుకెర్ బర్గ్ సంపద సగానికి పైగా కరిగిపోయింది. అయినా కానీ, ఇప్పటికీ ఎలాన్ మస్క్ 208.5 బిలియన్ డాలర్లతో ప్రపంచ కుబేరుడుగా కొనసాగుతున్నారు. జెఫ్ బెజోస్ 129.6 బిలియన్ డాలర్ల సంపదను కలిగి ఉన్నారు. ఫ్రాన్స్ కు చెందిన బెర్నార్డ్ ఆర్నాల్డ్ 128.7 బిలియన్ డాలర్లు, బిల్ గేట్స్ 114.8 బిలియన్ డాలర్లు కలిగి ఉన్నారు. 100 బిలియన్ డాలర్లకు పైన సంపద ఉన్న వారు ఈ నలుగురే. జుకెర్ బర్గ్ 60 బిలియన్ డాలర్లతో 17వ స్థానంలో ఉన్నారు.
ఇదిలావుంటే సాధారణంగా కుబేరుల సంపదను వారి కంపెనీల్లో వారికి ఉన్న వాటాల మార్కెట్ విలువను లెక్కించి చెబుతుంటారు. స్టాక్ మార్కెట్లో షేర్ల ధరలు రోజువారీగా మారుతుంటాయి. కనుక వీరి సంపద కూడా స్థిరంగా ఉండదు. మార్కెట్లతోపాటే ప్రయాణిస్తుంటుంది. ఈ విధంగా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 500 సంపన్నుల నెట్ వర్త్ 2022 మొదటి ఆరు నెలల్లో 1.4 ట్రిలియన్ డాలర్లు (రూ.117 లక్షల కోట్లు) తగ్గిపోయింది.