దుబాయ్ వెళ్ళేందుకు ఢిల్లీ నుంచి బయల్దేరిన స్పైస్‌జెట్ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో ఆ విమానం పాకిస్థాన్ లోని కరాచీ లో మంగళవారం అత్యవసరంగా దిగింది.ఈ విమానంలోని అందరు ప్రయాణికులు క్షేమంగా ఉన్నట్లు ఓ వార్తా సంస్థ వెల్లడించింది. మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది.స్పైస్‌జెట్ అధికార ప్రతినిధిని ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, స్పైస్‌జెట్ బీ737 ఎయిర్‌క్రాఫ్ట్ ఆపరేటింగ్ ఫ్లైట్ ఎస్‌జీ-11 (ఢిల్లీ-దుబాయ్-)ను ఇండికేటర్ లైట్ సక్రమంగా పని చేయకపోవడంతో కరాచీకి దారి మళ్ళించినట్లు తెలుస్తోంది. ఈ విమానం కరాచీలో సురక్షితంగా దిగింది. దీనిలోని ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది.అయితే ఎటువంటి అత్యవసర పరిస్థితిని ప్రకటించలేదని, విమానం సాధారణ స్థితిలోనే ల్యాండింగ్ అయిందని, ప్రయాణికులకు ఆహార ఏర్పాట్లు చేస్తామని ఆ అధికార ప్రతినిధి చెప్పారు. మరొక విమానాన్ని కరాచీకి పంపించి, అక్కడి నుంచి ప్రయాణికులను దుబాయ్‌కి తరలించనున్నట్లు తెలిపారు.
ఇదిలావుండగా, జూలై 2న కూడా స్పైస్‌జెట్ విమానం ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసరంగా దిగింది. 5000 అడుగుల ఎత్తులో ఎగురుతుండగా విమానం కేబిన్‌లో పొగ రావడంతో ఈ విమానాశ్రయంలో దించారు. ఈ విమానం ఢిల్లీ నుంచి జబల్‌పూర్ వెళ్ళేందుకు బయల్దేరింది.