రష్యా, ఉక్రెయిన్ మధ్య సాగుతున్న యుద్దంతో ఓ ఆసక్తికర ద్వీపం గురించి చర్చ మొదలైంది. ఉక్రెయిన్ భూభాగంలోని బ్లాక్ సీలో అర కిలోమీటరు పొడవు, అంతకన్నా తక్కువ వెడల్పుతో ఉండే అతి చిన్న ద్వీపం స్నేక్ ఐలాండ్. సముద్ర మట్టం కంటే కేవలం 135 మీటర్లు ఎత్తు మాత్రమే ఉంటుంది. అయితే ఉక్రెయిన్ లో కీలక ఆర్థిక ప్రాంతమైన ఒడెస్సా పోర్టుకు ఇది 140 కిలోమీటర్ల దూరంలోనే ఉండటం, బ్లాక్ సీలో నౌకల కదలికలపై నిఘా పెట్టేందుకు వీలుండటం ఈ ద్వీపానికి ఉన్న ప్రత్యేకతలు.
ద్వీపం అతి చిన్నదే అయినా.. దీని కోసం ఎన్నో దేశాల మధ్య యుద్ధాలు జరిగాయి. దాదాపు మూడు వందల ఏళ్ల చరిత్ర దీనితో ముడిపడి ఉంది. 1788 జులైలో రష్యాకు, టర్కీ చక్రవర్తికి మధ్య ఈ ద్వీపం కోసం యుద్ధాలు జరిగాయి. అందులో రష్యా గెలిచి ద్వీపాన్ని తన అధీనంలోకి తీసుకుంది.
ఆ తర్వాత కూడా యుద్ధాలలో రష్యాకు, టర్కీకి మధ్య మారుతూ వచ్చింది. కొన్నేళ్లపాటు రొమేనియా అధీనంలోకి వెళ్లింది. మొదటి ప్రపంచ యుద్ధంలో ఈ ద్వీపంపై టర్కీ దాడి చేయగా.. రెండో ప్రపంచ యద్ధంలో సోవియట్ యూనియన్, రొమేనియాల మధ్య యుద్ధం జరిగింది. 1944లో ఈ ద్వీపం సోవియట్ యూనియన్ అధీనంలోకి వచ్చింది. 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం కావడంతో ఉక్రెయిన్ చేతిలోకి వచ్చింది.
పురాణాల ప్రకారం స్నేక్ ఐలాండ్ గ్రీకు వీరుడు, దేవుడిగా పూజించే అకిలెస్ సమాధి స్థలం అనే ప్రచారం ఉంది. ఆ దేవుడి పేరిట ఆలయం కూడా ఉండేది. 1788లో రష్యా, టర్కీల మధ్య యుద్ధంలో, ఆ తర్వాతి యుద్ధాల సమయంలో, రొమేనియా దాడి చేసినప్పుడు.. ఇలా ప్రతిసారి ఈ ద్వీపాన్ని ఆక్రమించుకున్న దేశాలకు తీవ్రంగా నష్టం జరుగుతూ వచ్చింది. అందుకే ఈ ద్వీపానికి శాపం ఉందేమోనన్న ప్రచారమూ ఉంది. ఇప్పుడు కూడా స్నేక్ ఐలాండ్ పై దాడి చేసి బాంబులు కురిపించిన రష్యాకు చెందిన మాస్కోవా యద్ధ నౌక కొన్ని రోజుల్లోనే దెబ్బతిని మునిగిపోయింది. దీని సమీపంలోనే రష్యాకు చెందిన ఇతర నౌకలూ దెబ్బతిన్నాయి. ఒక విమానంకూడా కూలిపోయింది.