రష్యా చేస్తున్న భీకర దాడులకు ఏ మాత్రం ఒరవకుండా ఉక్రెయిన్ ఢీ అంటే ఢీ అంటోంది. బ్లాక్ సీలో అత్యంత కీలకమైన స్నేక్ ఐలాండ్ తిరిగి ఉక్రెయిన్ అధీనంలోకి వచ్చింది. ఉక్రెయిన్ పై దాడికి దిగిన రష్యా.. అన్నింటికన్నా ముందు ఈ స్నేక్ ఐలాండ్ పైనే దాడి చేసి స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ ద్వీపాన్ని తమ అధీనంలోనే ఉంచుకున్న రష్యా సేనలు దాదాపు వారం కింద అక్కడి నుంచి వైదొలిగాయి.
తాజాగా ఆ ద్వీపాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నట్టు ఉక్రెయిన్ ప్రకటించింది. ఆ దేశ దక్షిణ మిలటరీ కమాండ్ అధికారి నటాలియా హ్యూమెనియూక్ దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. స్నేక్ ఐలాండ్ లో సైనిక చర్య పూర్తయిందని, రష్యా దళాలను తరిమికొట్టి ఆ భూభాగాన్ని అధీనంలోకి తెచ్చుకున్నామని ప్రకటించారు. తిరిగి స్నేక్ ఐలాండ్ పై ఉక్రెయిన్ జెండాను ఎగురవేసినట్టు తెలిపారు.