ఓటు హక్కుకే కాదు ఇకపై టిక్ టాక్ లో నట్టించాలంటే కనీసంగా 18 ఏళ్లు నిండివుండాలి. అవును మీరు వింటున్నది నిజమే. చైనాకు చెందిన షార్ట్-వీడియో మేకింగ్ యాప్ ‘టిక్ టాక్’లో కీలక మార్పు రానుంది. టిక్ టాక్ లో ప్రత్యక్ష ప్రసారాలు చూసేందుకు వయో నిబంధన పెట్టాలని ఆ సంస్థ భావిస్తోంది. ఇకపై, 18 ఏళ్లు నిండిన వాళ్లు మాత్రమే టిట్ టాక్ లో లైవ్ ను వీక్షించేలా యాప్ లో మార్పులు చేస్తోందని తెలుస్తోంది. మైనర్లు అడల్ట్ కంటెంట్‌ను చూడకుండా నిరోధించడానికే ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. ఈ మేరకు తీసుకొస్తున్న కొత్త సెట్టింగ్ ను ప్రస్తుతం ఎంపిక చేసిన వినియోగదారులతో పరీక్షిస్తోంది.
ఈ పరీక్ష వ్యవధిలో ఎంపిక చేసిన వినియోగదారులు తమ ప్రత్యక్ష ప్రసారాన్ని పెద్దలకు మాత్రమే పరిమితం చేయడానికి ‘మెచ్యూర్ థీమ్‌లు’ బటన్ అనే ఆప్షన్ ఇచ్చారు. దీన్ని ఆన్ చేస్తే ‘18 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వీక్షకులు మాత్రమే మీ ప్రత్యక్ష ప్రసారాన్ని చూడగలరు’ అని తెరపై కనిపిస్తుందని టిక్ టాక్ చెబుతోంది. వినియోగదారులు ఈ సెట్టింగ్‌ను ఆన్ చేసిన తర్వాత.. సదరు వీడియో 18 అని ట్యాగ్ చేయబడిందని స్క్రీన్ పై నోటిఫికేషన్ వస్తుంది. అంతకంటే తక్కవ వయసు ఉన్న వాళ్లు సదరు వీడియోలు చూడాలని ప్రయత్నిస్తే అవి కనిపించకుండా పోతాయని టిక్ టాక్ చెబుతోంది. కాగా, భారత్ లో టిక్ టాక్ సహా పలు చైనా యాప్స్ పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది.