సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలంటే మన ఎముకలు ఆరోగ్యంగా ఉండాలి. ఎముకల ఆరోగ్యానికి, దృఢత్వానికి ముఖ్యంగా కాల్షియం, విటమిన్ -డి చాలా అవసరం. వీటితో పాటు మాంసకృత్తులు, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, విటమిన్- కె ఎముకల నిర్మాణానికి, ఎముకలు పెళుసుబారకుండా ఉండడానికి అత్యవసరం. పాలు, పెరుగు ముఖ్యమైన కాల్షియాన్ని, ఫాస్ఫరస్‌ను అందిస్తాయి. కొన్ని రకాల ఆకు కూరల్లో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. పప్పు ధాన్యాల నుంచి, పాలు, పాల ఉత్పత్తుల నుంచి కూడా మనకు మాంసకృత్తులు లభిస్తాయి. విటమిన్ - డి సూర్యరశ్మిలో తిరగడం వల్ల లభిస్తుంది. అలాగే ఈ విటమిన్ - డి తో ఫోర్టిఫై చేసిన పాలను తీసుకోవడం వల్ల కాల్షియం, విటమిన్ - డి రెండూ లభిస్తాయి. ఇలా అన్ని రకాల కూరలు, పళ్ళు, ఆకుకూరలు, పాలు, పెరుగు కలిగిన సమతుల ఆహారం తీసుకుంటే ఎముకలు బలంగా దృఢంగా ఉంటాయి. కానీ ఎక్కువ మోతాదులో ఉప్పు, కూల్ డ్రింక్స్, మాంసాహారం, కాఫీ, తీసుకోవడం, ధూమపానం చేయడం, శారీరక శ్రమ లేదా వ్యాయామం చేయకపోవడం వల్ల మన ఎముకలు పెళుసు బారే అవకాశం ఉంది. కాబట్టి, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో, వ్యాయామం చేస్తుంటే ఎముకలతో పాటు మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం.