రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని బలంగా నమ్మిన రైతుజన బాంధవుడు. లక్ష కోట్లు ఖర్చయినా కోటి ఎకరాలకు సాగు నీరు అందించాలన్న లక్ష్యం కోసం పనిచేసిన అపర భగీరథుడు. నిరుపేదలకు కూడా ఆరోగ్య భద్రతను కల్పించిన ఆరోగ్యశ్రీ ప్రదాత. పింఛనుదారులకు ప్రతినెలా 1వ తారీఖునే పింఛన్ అందించడం వైఎస్ పాలనలోనే మొదలైంది. పేద కుటుంబాల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వడం సరికొత్త ప్రయోగం. ఏ రంగాన్నీ, ఏ వర్గాన్నీ నిర్లక్ష్యం చేయని సుపరిపాలకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి . ఆయన ఆశయాల కొనసాగింపునకు ఆవిర్భవించిన వైసీపీ నేటి నుంచి జరిగే ప్లీనరీలో అందుకు పునరంకితమవుతోంది.
విశ్వసనీయత, ఆపేక్ష, ధైర్యం, కరుణ, జాగరూకత... ఈ ఐదు లక్షణాలూ కలిగిన విలక్షణ వ్యక్తిత్వం వై.ఎస్.రాజశేఖరరెడ్డి సొంతం. కడప జిల్లా జమ్మల మడుగు మిషనరీ ఆస్పత్రిలో 1949 జులై 8న వైఎస్ జన్మించారు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత, రూపాయికే వైద్యం అందించారు. నాడి చూసి ప్రజల జబ్బులను పసిగట్టి చికిత్స చేసిన ఆయన... 28 ఏళ్ల వయసులోనే రాజకీయ నాయకుడిగా మారి, అతి పిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా జయకేతనం ఎగుర వేశారు. నాలుగు సార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఓటమి ఎరుగని నేతగా చరిత్ర సృష్టించారు.