గుంటూరు ఏఎన్‌యూ సమీపంలో ఏర్పాటు చేసిన ప్లీనరీ సమావేశాలను సీఎం వైయస్ జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్ష హోదాలో లక్షలాది మంది నాయకులు, కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి ప్రారంభ ఉపన్యాసం చేశారు. ‘‘ఒకసారి మన పార్టీ గురించి, ఎక్కడ నుంచి మొదలుపెట్టాం.. ఎక్కడకు వచ్చాం అనేది ఆలోచన చేస్తే.. సెప్టెంబర్ 25వ తేదీన 2009లో పావురాల గుట్టలో ఈ సంఘర్షణ (13 ఏళ్ల క్రితం) ప్రారంభమైంది. ఓదార్పు యాత్రలో ఓ రూపం సంతరించుకొని, 2011 మార్చిలో ఓ పార్టీగా ఆవిర్భవించింది వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ. 11 ఏళ్ల క్రితం పుట్టిన ఈ పార్టీ కోసం, నాన్న గారి ఆశయాల సాధన కోసం మనందరి ఆత్మాభిమానం కోసం, అవమానాలను సహించి, కష్టాలను భరించి, నన్ను అమితంగా ప్రేమించి ఈ ప్రయాణంలో నాతో నిలబడి, నాకు వెన్నుదన్నుగా ఉన్న ప్రతి ఒక్క అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతీ తాతకు కూడా, ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతీ అభిమానికి మన జెండా తమ గుండెగా మార్చుకున్న వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ యోధులకు, కోట్లమంది మనసున్న మనుషులకు మీ జగన్ ప్రేమ పూర్వకంగా, హృదయపూర్వకంగా, కృతజ్ఞతా పూర్వకంగా, మీ వాడిగా, మీ ఆప్తుడిగా, మీ కుటుంబ సభ్యులుగా సెల్యూట్ చేస్తున్నాను అని మాట్లాడారు.