నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 55వ రోజున 39వ డివిజన్ చమ్మండి వారి తోట ప్రాంతంలో జరిగింది. ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి కుటుంబాన్ని పలుకరించిన కేతంరెడ్డికి పలువురు తమ సమస్యలను విన్నవించారు. సావధానంగా ప్రతి ఒక్కరి సమస్యను విన్న కేతంరెడ్డి ఆ సమస్యల పరిష్కారానికి తమ వంతు పోరాటం చేస్తామని ప్రజలకు భరోసా కల్గించారు.
ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి దృష్టికి పలువురు మహిళలు మద్యపాన నిషేధం అంటూ ఓట్లు వేయించుకున్న జగన్, అధికారంలోకి వచ్చాక అడ్డగోలు అమ్మకాలు ఎలా చేస్తున్నారో, రేట్లు పెంచేసి పిచ్చి మద్యాన్ని ఎలా అందిస్తున్నారో వివరించారు. పలు ఇళ్ళలో ఈ మద్యం మహమ్మారి వల్ల రూపాయి కూడా మిగలట్లేదని తమ జీవితాలు నాశనం అవుతున్నాయని వాపోయారు. ఈ పిచ్చి మద్యాన్ని త్రాగి 21 ఏళ్ళ తన బిడ్డ మరణించాడని ఓ తల్లి కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఎదుట కన్నీటి పర్యంతం అయింది. కేతంరెడ్డి వినోద్ రెడ్డి స్పందిస్తూ మద్య నిషేధం అంటూ పాదయాత్రలో ప్రతి ఊరిలో ప్రసంగాలు ఊదరగొట్టిన జగన్ రెడ్డి గారు నేడు మాట తప్పి ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసి ప్రతి ప్రాంతంలో ప్రభుత్వ మద్యం దుకాణాలను, ఎలైట్ మద్యం దుకాణాలను ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. గతంలో 60 రూపాయలు ఉండే చీప్ లిక్కర్ ను నేడు 260 రూపాయలకు అమ్ముతున్నారని, ఆ చీప్ లిక్కర్ కూడా విషతుల్యంగా ఉండే పిచ్చి మద్యం అని ఆరోపించారు. ఈ మద్యం త్రాగిన వారిలో అనేకమందికి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని, రాత్రికి రాత్రి గుండె పట్టేసి చనిపోయే వారు ఎక్కువవుతున్నారని, అవన్నీ గుండె నొప్పి మరణాలు కాదని, జగనన్న పిచ్చి మద్యం మరణాలు అని, వైసీపీ ప్రభుత్వంలో మద్యనిషేధం కాస్తా జనాభా నియంత్రణ అయిందని కేతంరెడ్డి ఆరోపించారు.