భద్రతా సిబ్బంది అప్రమత్తమై ఉంటే జపాన్ మాజీ ప్రధాని షింజో అబె ప్రాణలతో భయటపడే వారని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ వీడియోలో స్పష్టమైంది. జపాన్ మాజీ ప్రధాని షింజో అబె దారుణ హత్య ఆ దేశ పౌరులతో పాటు యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. జపాన్ పార్లమెంట్ ఎగువసభకు జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన ర్యాలీల్లో పాల్గొన్న షింజో అబె శుక్రవారం (జులై 8) ఉదయం నరా నగరంలోని ఓ కూడలిలో ప్రసంగిస్తుండగా తుత్సుయ యమగామి అనే 41 ఏళ్ల వ్యక్తి అతి సమీపంగా రెండు సార్లు కాల్పులు జరిపాడు. దీంతో షింజో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. అయితే, దుండగుడి తుపాకీ నుంచి వెలువడ్డ తొలి బుల్లెట్ గురి తప్పింది. రెండో బుల్లెట్ షింజో అబె ఛాతీలోకి దూసుకెళ్లింది. ఈ గ్యాప్‌లో భద్రతా సిబ్బంది అప్రమత్తమై ఉంటే జపాన్ మాజీ ప్రధాని ప్రాణాలు నిలిచి ఉండేవేమోననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా తన ట్విటర్ అకౌంట్ ద్వారా షింజో అబెపై దాడికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. భద్రతా సిబ్బంది ఆ గన్‌మ్యాన్‌ను వెంబడించే బదులు.. షింజో అబెకు రక్షణగా నిలిచి ఉంటే, మరోలా ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వీడియో వైరల్ అవుతోంది. ‘తొలి షాట్ మిస్సయింది. రెండో షాట్ వరకు ఆయన (షింజో అబె) ప్రాణాలను రక్షించేంత గ్యాప్ ఉంది. భద్రతా సిబ్బంది దుండగుడిని వెంబడించే బదులు షింజో అబే వైపు దూకి, ఆయనకు రక్షణ వలయంగా ఉండలేరా? అలా చేసుంటే షింజో అబె ఈ ఘటన నుంచి ప్రాణాలతో బయటపడి ఉండేవారేమో’ అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.
నిందితుడు యమగామి మొదటిసారి ఫైరింగ్ చేసిన బుల్లెట్ షింజో అబె పక్కన నుంచి దూసుకెళ్లింది. ఏం జరిగిందో అక్కడున్న వారికి అర్థంకాలేదు. కాల్పుల శబ్దం విని షింజో అబె కూడా వెనక్కి తిరిగారు. ఈలోగా నిందితుడు రెండోసారి ఫైరింగ్ చేశాడు. దీంతో బుల్లెట్ నేరుగా వచ్చి ఆయన ఛాతీలోంచి దూసుకెళ్లి గుండెను చిధ్రం చేసింది. ఈ వీడియోలో ఇది స్పష్టంగా కనిపిస్తోంది.