నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పరమ్ అయ్యర్ సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. 1981 ఐఏఎస్ బ్యాచ్ అధికారి అయిన పరమ్ అయ్యర్ ఉత్తరప్రదేశ్ కేడర్‌లో పనిచేశారు. ఇదివరకే కేంద్ర సర్వీసుల్లో చేరిపోయిన ఆయన మోదీ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ మిషన్‌లో విశేషంగా రాణించారు. గ్రామీణ భారతంలో 9 కోట్ల వ్యక్తిగత మరుగు దొడ్ల నిర్మాణం జరిగేలా ఆయన విశేష పనితీరును చాటారు. ఇటీవలే నీతి ఆయోగ్ సీఈఓగా పరమ్‌ను ఎంపిక చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం ఢిల్లీలోని నీతి ఆయోగ్ కార్యాలయానికి వచ్చిన అయ్యర్... సీఈఓగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. నీతి ఆయోగ్‌లో భాగస్వామిని అవుతున్నందుకు గర్వంగా ఉందంటూ ఆయన సోమవారం మధ్యాహ్నం ఓ ట్వీట్ పోస్ట్ చేశారు.