అర్హులకు 90 రోజుల్లో ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమంపైనా సీఎం వైయస్ జగన్ సమీక్షించారు. లబ్ధిదారునికి కేవలం ఎక్కడ ఇంటి స్థలం ఇచ్చిందీ చూపడమే కాకుండా.. పట్టా, దానికి సంబంధించిన డాక్యుమెంట్ల అన్నీకూడా ఇవ్వాలని, స్థలం ఇచ్చారని, దానికి సంబంధించిన పట్టా, డాక్యుమెంట్లు కూడా ఇచ్చారని లబ్ధిదారుల నుంచి ధృవీకరణ తీసుకోవాలని అధికారులకు సీఎం వైయస్ జగన్ ఆదేశించారు.
జగనన్న కాలనీల్లో డ్రెయిన్లు సహా కనీస మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. డ్రైనేజీ, కరెంటు, నీటి సరఫరా అంశాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. ఇళ్లలో పెట్టే ఫ్యాన్లు, బల్బులు, ట్యూబ్‌లైట్లు నాణ్యతతో ఉండేలా చూసుకోవాలని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడొద్దని సూచించారు. జగనన్న కాలనీల రూపంలో కొన్నిచోట్ల ఏకంగా మున్సిపాలిటీలే తయారవుతున్నాయని, అలాంటి చోట్ల మౌలిక సదుపాయాల కల్పన, పౌరసేవలు తదితర అంశాలపై ప్రత్యేక ప్రణాళిక ఉండాలని ఆదేశించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, ఏపీఎస్‌హెచ్‌సీఎల్ చైర్మన్ దవులూరి దొరబాబు, సీఎస్ సమీర్ శర్మ, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ జి.సాయి ప్రసాద్, గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్ ఏపీఎస్‌హెచ్‌సీఎల్ ఎండీ నారాయణ భరత్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.