శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం విడిచి పారిపోవడంతో ఆ దేశ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి దేశంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రధాని కార్యాలయం ప్రకటించింది.శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స తన పదవికి రాజీనామా చేయకుండా దేశం విడిచి పారిపోయారు. ఆయన భార్య సహా ఇద్దరు బాడీగార్డ్స్తో కలిసి వాయుసేన విమానంలో మాల్దీవుల రాజధాని మాలేకు పరారయ్యారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి కార్యాలయం కూడా ధ్రువీకరించింది.మాల్దీవులు ప్రభుత్వం వెలనా విమానాశ్రయంలో రాజపక్సకు స్వాగతం పలికింది. మరోవైపు, శ్రీలంక ప్రభుత్వ ఆదేశాల మేరకే అధ్యక్షుడిని తరలించామని ఆ దేశ వాయుసేన ప్రకటించింది.
అధ్యక్షుడు పారిపోవడంతో నిరసనకారులు కొన్ని చోట్ల సంబరాలు చేసుకున్నారు. మరికొంతమంది గొటబాయను దేశం విడిచి పారిపోయేందుకు ప్రభుత్వం సహకరించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది పోలీసు వాహనాలపై రాళ్లు రువ్వారు. దేశంలో మళ్లీ హింసాత్మక ఆందోళనలు చెలరేగే అవకాశం ఉండటంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు ప్రకటించింది.
అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఏ క్షణంలోనైనా రాజీనామా చేసే అవకాశం ఉన్నందున శ్రీలంకలో అఖిలపక్ష ప్రభుత్వ ఏర్పాటుకు విపక్ష పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఎస్‌జేబీ, ఎస్‌ఎల్‌ఎఫ్‌పీ నేతలు సంప్రదింపులు ముమ్మరం చేశారు. తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేందుకు ఎస్‌జేబీ నేత సాజిత్ ప్రేమదాస ఇప్పటికే అంగీకారం తెలిపారు. ఆయనకు మద్దతను కూడగట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి.