వ్యాపార రంగంలో మరో నూతన అధ్యయం మొదలైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్.. ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తో జట్టు కట్టింది. ఇకపై నెట్ ఫ్లిక్స్‌లో అందించే అన్ని ప్రకటనలు మైక్రోసాఫ్ట్ ప్లాట్‌ఫారమ్ ద్వారా ప్రత్యేకంగా అందుబాటులో ఉంటాయి. మరోవైపు నెట్ ఫ్లిక్స్ ప్రస్తుత ప్లాన్స్ కొనసాగుతాయని ఆ సంస్థ తెలిపింది. ప్రస్తుతం ప్రకటనలు లేని బేసిక్, స్టాండర్డ్ మరియు ప్రీమియం ప్లాన్‌లు కొత్తపాత కస్టమర్‌లకు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.
ఇదిలావుంటే నెట్ ఫ్లిక్స్ లో మొదటి సారి ప్రకటనలతో కూడిన (యాడ్-- సపోర్టెడ్) సబ్ స్క్రిప్షన్ ప్లాన్లను ప్రారంభించడానికి భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఇరు కంపెనీలు ప్రకటించాయి. ఈ మధ్య కాలంలో నెట్ ఫ్లిక్స్ వినియోగదారులు తగ్గిపోతున్నారు. ఈ నేపథ్యంలో నెట్ ఫ్లిక్స్ కొత్త యాడ్-సపోర్టెడ్ ఆఫర్‌ను ప్రకటించిన కొన్ని నెలల తర్వాత ఆ సంస్థ.. మైక్రోసాఫ్ట్ తో భాగస్వామి అవడం ప్రాధాన్యత సంతరించుకుంది. తమ భాగస్వామ్య వార్తను ఇరు కంపెనీలు వేర్వేరుగా ప్రకటించాయి.
నెట్ ఫ్లిక్స్ కు టెక్నాలజీ, సేల్స్ పార్ట్‌నర్ గా వ్యవహరించబోతున్నందుకు ఉత్సాహంగా ఉన్నట్టు మైక్రోసాఫ్ట్ పేర్కొంది. అయితే కొత్త యాడ్- సపోర్టెడ్ మోడల్ ను ఎప్పుడు విడుదల చేసే విషయాన్ని మాత్రం ఇరు కంపెనీలు ఇంకా వెల్లడించలేదు. ఇదిలావుంటే తమ ప్రకటనల అవసరాల కోసం మైక్రోసాఫ్ట్ వైపు చూస్తున్న విక్రయదారులకు తాజా భాగస్వామ్యంతో నెట్ ఫ్లిక్స్ ప్రేక్షకులను చేరువయ్యే అవకాశం లభించనుంది.