వరద తగ్గాక పోలవరం పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టులో కీలక నిర్మాణాలు.. ముందస్తుగా వచ్చిన వరదల కారణంగా తలెత్తిన పరిణామాలపై ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష చేపట్టారు. జల వనరుల శాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో గురువారం సమీక్ష చేపట్టారు. పోలవరం సహా ప్రాధాన్యతా ప్రాజెక్టులపై ఈ సందర్భంగా ఆరా తీశారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం నుంచి రీయింబర్స్ చేయాల్సిన మొత్తం రూ.2,900 కోట్లని, రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులతో ఈ ఖర్చు చేసిందని సీఎం వైయస్ జగన్ అధికారులతో ప్రస్తావించారు. పోలవరం ప్రాజెకులో జరుగుతున్న పనులను వేగవంతంగా చేయడానికి అడహాక్‌గా రూ.6వేల కోట్ల నిధులను కేంద్రం నుంచి రప్పించుకునేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం. కాంపొనెంట్ వైజ్‌గా రీయింబర్స్ చేసే విధానంలో కాకుండా.. అడహాక్‌గా డబ్బులు తెప్పించుకుంటే..., ప్రాజెక్టుకు సంబంధించిన కీలక పనులను త్వరితగతిన ముందుకు కొనసాగించవచ్చని అధికారులకు ఆయన సూచించారు. వరద తగ్గగానే ఈ పనులు శరవేగంతో చేయడానికి ఈ డబ్బు ఉపయోగపడుతుందని తెలిపారాయన. ఈమేరకు అడహాక్‌గా కేంద్రం నుంచి నిధులు తెప్పించుకునే అంశంపై దృష్టిపెట్టాలని, కేంద్రానికి లేఖలు కూడా రాయాలని సీఎం జగన్ తెలిపారు. పోలవరం కుడి, ఎడమ కాల్వలకు సంబంధించి హెడ్ వర్క్స్, కనెక్టివిటీ పనులపై ప్రత్యేక దృష్టిపెట్టాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు.