ఏపీలో రవాణా రంగంలో స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు వైఎస్సార్ వాహన మిత్ర పథకాన్ని ముఖ్యమంత్రి జగన్ వరుసగా నాలుగో ఏడాది ప్రారంభించారు.ఈ పథకం కింద ఈ ఏడాది 2,61,516 మంది అర్హులకు ప్రయోజనాలు అందిస్తున్నారు. ఒక్కో లబ్ధిదారుడి ఖాతాలో రూ.10వేల చొప్పున వేస్తున్నారు. విశాఖపట్నంలో జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఆటోవాలాలా చొక్క వేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కరోనా సమయంలోనూ తాము వాహన మిత్ర పథకం అమలు చేశామని తెలిపారు.ఇప్పటివరకు ఒక్కో కుటుంబానికి మొత్తం రూ.40 వేల వరకు ఇచ్చామని అన్నారు. నేడు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం కలిపి 261.51 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నామని ఆయన చెప్పారు. సొంత వాహనం కలిగిన వారికి ఆర్థిక సాయం అందజేస్తున్నామని వివరించారు. ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లు లబ్ధి పొందుతున్నారని చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వమూ ఇలా చేయలేదని అన్నారు. తమది పేదల ప్రభుత్వమని, పేదలకు అండగా ఉండే ప్రభుత్వమని ఆయన చెప్పారు.
గతంలో అందరూ కలిసి దోచుకున్నారని, ఇప్పుడు అవినీతి లేకుండా నేరుగా అకౌంట్లలో డబ్బులు పడుతున్నాయని ఆయన అన్నారు. తాము మూడేళ్ళలో రూ.1.65 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో వేశామని చెప్పారు. తమ పాలనలో ఎక్కడా లంచాలు, వివక్ష లేదని చెప్పుకొచ్చారు. అప్పటి ప్రభుత్వానికి, ఇప్పటి ప్రభుత్వానికి ఉన్న తేడాను ప్రజలు గమనించాలని ఆయన అన్నారు. గత ప్రభుత్వం కన్నా ఇప్పటి ప్రభుత్వం చేస్తున్న అప్పులు కూడా చాలా తక్కువేనని ఆయన చెప్పారు. గతంలో దోచుకో, పంచుకో అనే విధానంతో పనిచేశారని ఆయన అన్నారు.