ద్రౌపది ముర్మును దృష్టిలో పెట్టుకుని రాష్ట్రపతి భవన్‌కు విగ్రహం అవసరం లేదని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ పేర్కొన్నారు. "రాష్ట్రపతి భవన్‌లో విగ్రహం అవసరం లేదు. యశ్వంత్ సిన్హా మాట్లాడటం మీరు చాలాసార్లు విని ఉంటారు, కానీ మీరు ఎప్పుడైనా ద్రౌపది ముర్ము మాట్లాడటం విన్నారా. నేను అలాంటి మాటలు అనకూడదు, కానీ నేను ఆమె మాట్లాడుతుండగా ఎప్పుడూ వినలేదు. మీరు కూడా ఆమె మాటలు విన్నారని నేను అనుకోను. ఆమె ఎప్పుడూ ప్రెస్‌మీట్ నిర్వహించలేదు." అని తేజస్వి యాదవ్ అన్నారు.
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో ఉన్న ద్రౌపది ముర్ముపై గతంలో కూడా కొంతమంది నాయకులు విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నాయకుడు అజోయ్ కుమార్ కూడా ముర్ము ఓ దుర్మార్గపు తత్త్వానికి ప్రాతినిధ్యం వహిస్తారంటూ వ్యాఖ్యలు చేశారు. ఇది రాజకీయ తుఫాన్‌కు దారి తీసింది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్‌లో పడింది. దాంతో ముర్ము ఒక మంచి మహిళ అని.. అజోయ్ కుమార్ విమర్శలు ముర్ము గురించి కాదని వివరణ ఇచ్చింది. అజోయ్ కుమార్ బీజేపీ ఆర్‌ఎస్‌ఎస్ భావజాలానికి సంబంధించి ఆ కామెంట్స్ చేసినట్టు స్పష్టం చేసింది.
అదే విధంగా ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ముర్ము పేరు ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ పుదుచ్చేరి యూనిట్ ఆమెను డమ్మీ ప్రెసిడెంట్ అని పేర్కొంది. ఇదిలా ఉండగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలి రోజైన సోమవారం రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. జూలై 21న దీని ఫలితాలు వస్తాయి. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు ఆర్జేడీ ఇప్పటికే మద్దతు ప్రకటించింది.