గోదావరి వరద పరిస్థితులు, సహాయక చర్యలపై జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం వైయస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వరద పరిస్థితులు, సహాయక కార్యక్రమాల తీరు తెన్నులను సమీక్షించారు. ‘‘కొందరికి రాజకీయ ప్రయోజనాలు చేకూర్చడానికి దుష్ప్రచారాలు చేస్తున్నారు. ప్రభుత్వంపై బురదజల్లడానికి నానా రకాలుగా ప్రయత్నిస్తున్నారు. మీరు మంచి చేస్తున్నప్పుడు వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. ఇలాంటి వాటిని తిప్పికొట్టాలి. వదంతులను కూడా తిప్పికొట్టాలి. మీకు అన్ని రకాలుగా సహాయ, సహకారాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. నిధుల సమస్య లేనే లేదు. వచ్చే 48 గంటల్లో బాధిత కుటుంబాలకు రేషన్, రూ.2 వేలు ఇవ్వాలి. వరద బాధిత కుటుంబాలతో మానవతా దృక్పథంతో వ్యవహరించండి’’ అని అధికారులను సీఎం వైయస్ జగన్ ఆదేశించారు.