వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణను నిలుపుదల చేయాలని, కర్మాగారానికి బొగ్గు గనులు కేటాయించాలని భారత నాస్తిక సమాజం జిల్లా అధ్యక్షులు వై. లోకరాజు డిమాండ్ చేశారు. స్టీల్‌ప్లాంట్, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖ అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల జెఎసి ఆధ్వర్యంలో జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన దీక్షలు ఆదివారానికి 472వ రోజుకు చేరుకున్నాయి. దీక్షలలో భారత నాస్తిక సమాజం కార్యకర్తలు కూర్చున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌పై ఆధారపడి లక్షలాది మంది జీవిస్తున్నారని తెలిపారు. సొంత గనులు లేనందు వల్ల కర్మాగారానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని తెలిపారు. దేశంలో ఇతర ప్రాంతాల నుంచి బొగ్గు దిగుమతి, సరఫరాకు రైల్వే శాఖ తగినన్ని రేక్‌లు కేటాయించడం లేదన్నారు. ప్రస్తుతం బొగ్గు కొరత వల్ల ప్లాంట్ ఉత్పత్తి తగ్గిపోతోందని అన్నారు. నష్టాల పేరు చెప్పి ప్లాంటును కేంద్ర ప్రభుత్వం అమ్మేసేందుకు ప్రయత్నించడం సరికాదన్నారు. దీక్షల్లో పాల్గొన్న వారిలో డి. విజ్ఞానంద్, జె. రాంప్రభు, సత్తిబాబు, సిహెచ్. తలుపులు, జి. రవికుమార్, ఆర్. కుమారస్వామి, రమణకుమారి, శ్యామల, కామేశ్వరరావు, పి. సత్యనారాయణ ఉన్నారు.