రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసేవారు ప్రమాణ పత్రంలో ఉండేదే చదవాలని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. టాలీవుడ్ కథారచయిత విజయేంద్ర ప్రసాద్ అనూహ్యరీతిలో రాజ్యసభకు నామినేట్ కావడం తెలిసిందే. పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా ఆయన ఇవాళ రాజ్యసభలో ఇంగ్లీషులో ప్రమాణస్వీకారం చేశారు. అయితే, విజయేంద్రప్రసాద్ ప్రమాణం చివర్లో 'జైహింద్' అంటూ ముగించారు. అనంతరం రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ఆసక్తికర సూచన చేయడం కనిపించింది. ప్రమాణస్వీకారం కోసం ఇచ్చిన పత్రంలో ఉన్నదే చదవాలని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. తమ ప్రమాణ పత్రంలో ఉన్న పదజాలానికి ఇతర పదాలను జోడించడం సరికాదని, ఆ అదనపు పదాలు రికార్డుల్లో చేరవని స్పష్టం చేశారు. పైగా, ఎవరైనా సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తే వారి ప్రమాణ స్వీకారం తిరస్కరణకు గురయ్యే అవకాశం కూడా ఉంటుందని హెచ్చరించారు. ఇది సభ్యులందరికీ వర్తిస్తుందని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. తాను ఏ ఒక్కరినో దృష్టిలో ఉంచుకుని ఈ మాటలు చెప్పడంలేదని తెలిపారు.