నాన్నకు ప్రేమతో ఓ కొడుకు ఎవరూ చేయని సాహసం చేశాడు. చనిపోతాడు అన్న భయంతో తండ్రికి తన కాలేయాన్ని దానం చేసేశాడు. కన్న తల్లిదండ్రులను కాటికి పోతున్నా కాలు కూడా పెట్టని సమాజం ఇది. అలాంటిది ఓ కొడుకు తన జీవితాన్నే ఫణంగా పెట్టి తండ్రికి పునర్జన్మని ఇచ్చాడు. కాలేయం పూర్తిగా పాడైపోయి.. మృత్యువుతో పోరాడుతున్న ఆ తండ్రి బాధ చూడలేక తన జీవితాన్నే త్యాగం చేశాడు. కాలేయం మార్పిడి చేయకపోతే బతకడమే కష్టమనడంతో ఆ కొడుకు తన కాలేయంలో అధిక భాగం ఇచ్చి తండ్రిని బతికుంచుకున్నాడు. ఈ బంధాన్ని చూసిన వారందరికీ కళ్లు చెమర్చక మానవు.
గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం అనంతవరప్పాడుకు చెందిన నర్రా రాంబాబు వ్యవసాయం చేస్తుంటాడు. రైతుగా ఉన్న ఈయనకు గత కొద్ది సంవత్సరాలుగా ఆరోగ్యం బాగుండటం లేదు. ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోగా కాలేయం దెబ్బతినిందని వైద్యులు చెప్పారు. ఆ విషయం తెలిసిన ఐదు నెలల్లోనే కాలేయం పూర్తిగా దెబ్బతినింది. దాంతో మృత్యువుతో పోరాడుతున్న రాంబాబును హైదరాబాద్‌లోని ఓ వైద్యశాలకు తరలించగా.. డాక్టర్లు కాలేయం మార్పిడి చేయాల్సిందేనని, లేకపోతే బతకడం కష్టమని తేల్చి చెప్పారు.
దాంతో ఏం చేయాలో తెలియక కుటుంబం మొత్తం కన్నీరుమున్నీరయ్యింది. ఆ సమయంలో గుంటూరు ఆర్‌వీఆర్ అండే జేసీ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ లాస్ట్ ఇయర్ చదువుతున్న కొడుకు నర్రా వినయ్ తండ్రికి తన కాలేయాన్ని ఇవ్వడానికి ఒప్పుకొన్నాడు. ఏకంగా కాలేయంలో 66 శాతం తండ్రికి దానం ఇచ్చాడు. మార్చి 24వ తేదీన వైద్యులు విజయవంతంగా కాలేయం మార్పిడి చేయగా.. వాళ్లిద్దరూ ఇప్పటికీ ఆరోగ్యంగానే ఉన్నారు. ఇలాంటి కొడుకు ఎంతమందికి ఉంటారు చెప్పండీ.