టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్‌పై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్ ప్రశంసల జల్లు కురిపించారు. తాజాగా ఆయన మాట్లాడుతూ… ”రిషబ్ పంత్ నిర్భయంగా ఆడే క్రికెటర్. కట్ షాట్, పుల్ షాట్, రివర్స్ స్వీప్, స్లాగ్ స్పీప్ వంటి షాట్లు ఆడగలుగుతాడు. గతంలో ఆస్ట్రేలియాలో అద్భుతంగా రాణించాడు. ఇటీవల ఇంగ్లండ్‌లో బాగా ఆడి టీమిండియాను ఒంటి చేత్తో గెలిపించాడు” అని అఖ్తర్ అన్నారు.
అయితే, రిషబ్ పంత్ తన ఫిట్‌నెస్‌పై మరింత దృష్టి పెట్టాలని అఖ్తర్ సూచించారు. ”రిషబ్ పంత్ కాస్త లావుగా ఉన్నాడు. అతడు దీనిపై దృష్టి పెడతాడని నేను అనుకుంటున్నాను. భారతీయ మార్కెట్ చాలా పెద్దది. రిషబ్ పంత్ చాలా బాగుంటాడు. మోడల్‌గా మారవచ్చు. కోట్లాది రూపాయలు సంపాదించవచ్చు. భారత్‌లో ఎవరైనా ఓ వ్యక్తి సూపర్ స్టార్‌గా మారితే అతడిపై కోట్లాది రూపాయల పెట్టుబడి పెడతారు” అని అఖ్తర్ చెప్పారు.
కాగా, వెస్టిండీస్‌తో జరిగే టోర్నీకి టీమిండియా సిద్ధమైంది. శిఖర్ ధావన్ వన్డే కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ప్రస్తుతం టీమ్ ట్రినిడాడ్‌లో ఉంది. తొలి వన్డే ఈ నెల 22న, 2వ వన్డే 24న, 3వ వన్డే 27న జరగనుంది. ఈ వన్డే సిరీస్‌కు రిషబ్ పంత్ దూరంగా ఉన్నాడు. ఇటీవల ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్ వేదికగా నిన్న జరిగిన చివరి వన్డే మ్యాచులో ఆతిథ్య జట్టుపై టీమిండియా గెలవడంలో బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ కీలక పాత్రపోషించాడు. రిషబ్ పంత్ క్రీజులో నిలదొక్కుకుని 113 బంతుల్లో 125 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. దీంతో అతడిపై మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.