భారత్‌కు స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చింది? అని అడిగితే టక్కున వచ్చే సమాధానం 1947 ఆగస్టు 15. అదే పాకిస్తాన్ కు ఎపుడూ అంటే ఒక రోజు ముందు అని టక్కున చెబుతాం. కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ జిల్లా ఈసూరు గ్రామం. 1942 ఆగస్టు నెలలోనే బ్రిటీష్ వారు స్వాతంత్య్రం ప్రకటించేశారు. కారణం 1942 ఆగస్టు 12న ఈసూరు గ్రామానికి బ్రిటిష్ వారు పన్నులు వసూలు చేసుకునేందుకు వచ్చారు. అయితే, గ్రామస్థులు మాత్రం బ్రిటిష్ వారిని గట్టిగా ఎదిరించాలని ముందే నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో గ్రామస్థులంతా కలిసి పన్ను కోసం వచ్చిన తెల్లవారిపై సమష్టిగా తిరగబడ్డారు. పన్నులు కట్టేది లేదని తేల్చిచెప్పారు. తమకు స్వాతంత్ర్యం ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేశారు. ఊహించని రీతిలో ఆంగ్లేయులు గ్రామస్థుల డిమాండ్‌ను అంగీకరించి గ్రామానికి స్వాతంత్ర్యం ప్రకటించారు. అలా ఈసూరు గ్రామానికి ఐదేళ్ల ముందే స్వాతంత్ర్యం వచ్చింది. అనంతరం నెల రోజుల తర్వాత (1942 సెప్టెంబర్ 29) బ్రిటిష్ వారు మళ్లీ ఈసూరు గ్రామంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. దీంతో గ్రామస్థులు వారిని గట్టిగా అడ్డుకున్నారు. స్థానిక భద్రేశ్వరాలయంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి స్వాతంత్ర్యం ప్రకటించుకున్నారు. ఈ పోరాటం ఇతర గ్రామాల్లో సైతం ప్రేరణ కలిగించి తెల్లవారిపై మరింత గట్టిగా పోరాటం చేసేందుకు దోహదం చేసింది. ఈ పోరాటాలు ఫలించి మరో ఐదేళ్లకు అంటే 1947 ఆగస్టు 15వ తేదీన దేశమంతా స్వాతంత్ర్యం లభించింది.