ట్రాఫిక్ మళ్లింపులో ఎంతటి అసహనానికి గురిచేస్తాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అలాంటి అసహనమే ప్రస్తుతం తిరుపతి నగరవాసుల్లో నెలకొంది. తిరుపతిలోని రామానుజ సర్కిల్ నుండి పూర్ణకుంభం కూడలి వరకు జరుగుతున్న శ్రీనివాస సేతు పనుల కారణంగా మళ్లించిన ట్రాఫిక్ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. లక్ష్మీపురం సర్కిల్ నుంచి వచ్చే వాహనాలు రామానుజ సర్కిల్ వరకు అనుమతించి రేణిగుంట మార్గం వైపు మళ్లించారు. ఆర్టీసీ బస్సులు అలిపిరి, కపిలతీర్థం నుంచి శ్రీనివాస సేతు మార్గంలో రావడంతో శ్రీనివాసం - బస్టాండు మధ్య ట్రాఫిక్ ఇబ్బందులు నెలకొన్నాయి. బస్టాండు నుంచి తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్ వద్ద అండర్ బ్రిడ్జి నుంచి డీఆర్ మహల్ రోడ్డులోకి ప్రవేశించే మార్గంలో వాహనాలు బారులు తీరుతున్నాయి.
తిరుపతికి తూర్పు మార్గం నుంచి వచ్చే పల్లె వెలుగు బస్సులు జాతీయ రహదారిపై ఆర్సీపురం జంక్షన్ వరకు వచ్చి బస్టాండుకు రావడం వల్ల సుమారు గంట ఆలస్యంగా నడుస్తున్నాయి. హీరో హోండా షోరూమ్ వద్ద ఉన్న రైల్వేగేటు మార్గంలోకి వాహనాలు మళ్లించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తరుచూ రైల్వే గేటు మూసివేస్తుండటంతో వాహనదారులు ట్రాఫిక్‌లో చిక్కుకుంటున్నారు. ట్రాఫిక్ మళ్లింపు వల్ల మొదటి రెండు రోజు కొన్ని చోట్ల ఎదురైన ఇబ్బందులను గుర్తించి సరిదిద్దుతామని ట్రాఫిక్ డీఎస్పీ కాటమరాజు చెప్పారు. నెల రోజులపాటు ట్రాఫిక్ మళ్లింపు కొనసాగనున్న నేపథ్యంలో ప్రజలు సహకరించాలని కోరారు.
తిరుపతిలో వాహనాల మళ్లింపు విషయానికి వస్తే.. బెంగళూరు, చిత్తూరు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు.. రామానుజపల్లి చెక్‌పోస్ట్ దగ్గర నుంచి శ్రీపద్మావతి మహిళా యునివర్సిటీ, అలిపిరి, నంది సర్కిల్, శ్రీనివాస సేతు మీదుగా బస్టాండుకు చేరుకోవచ్చు. ఇటు మదనపల్లి, పీలేరు, రాయచోటి, అనంతపురం నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు.. చెర్లోపల్లి సర్కిల్, బాలాజి కాలనీ, అలిపిరి, నంది సర్కిల్, శ్రీనివాస సేతు మీదుగా ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్లొచ్చు.
బస్టాండ్ నుంచి రేణిగుంటకు.. రామానుజం సర్కిల్, లక్ష్మీపురం సర్కిల్ వైపు వెళ్లాలంటే డీబీఆర్ హాస్పిటల్ మీదుగా హీరో హోండా షోరూమ్ దగ్గర రైల్వే లెవెల్ క్రాసింగ్ దాటి వెళ్లాలి. పల్లెవెలుగు ఆర్టీసీ బస్సులు.. రేణిగుంట మీదుగా నారాయణాద్రి హాస్పిటల్, తిరుచానూర్ ఫ్లై ఓవర్, ఆర్‌సీపురం జంక్షన్, ఎమ్మార్‌పల్లి పోలీసు స్టేషన్, అన్నమయ్య సర్కిల్, వెస్ట్ చర్చ్, బాలాజి కాలనీ, నంది సర్కిల్, శ్రీనివాస సేతు మీదుగా ఆర్టీసీ బస్టాండ్‌కు వస్తాయి. హైదరాబాద్, కర్నూల్, కడప వాహనాలు కరకంబాడి మీదుగా బస్టాండుకు చేరుకుంటాయి.
నెల్లూరు, సత్యవేడు, శ్రీకాళహస్తి, పుత్తూరు, చెన్నై నుంచి వచ్చే వాహనాలు.. రేణిగుంట రమణవిలాస్ సర్కిల్ మీదుగా కరకంబాడి, మంగళం లీలామహల్ మీదుగా వెళ్లొచ్చు. తమకు అందరూ సహకరించాలంటున్నారు పోలీసులు కోరుతున్నారు. స్థానికులు, ఉద్యోగులు, విద్యార్థులు.. ఈ మార్పులను గమనించి.. తమకు అనువైన మార్గాల్లో వెళ్లాలంటున్నారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా సహకరించాలంటున్నారు.