ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ర్యాంకుల వెనక ఇంత బాగోతమా

national |  Suryaa Desk  | Published : Sun, Jul 24, 2022, 12:55 AM

మా విద్యా సంస్థకు ఇన్ని ర్యాంకులు అని మనం వింటూవుంటాం. కానీ ఆ ర్యాంకులన్నీ వారివేనా అంటే అవుననే ఎవరైనా చెబుతారు. కానీ ర్యాంకులను కూడా ఇతరుల వద్దకొని అవి తమవి అని విద్యాసంస్థలు  చెప్పుకొంటున్నాయటా. ఇటీవల ఈ బాగోతం వెలుగులోకి వచ్చింది. మెడిసిన్ చదవడం అనేది చాలా మంది విద్యార్థుల కల. ఇందుకోసం అహర్నిశలు కష్టపడుతుంటారు. ఇంటర్‌తోపాటు నీట్‌లో మంచి ర్యాంక్ తెచ్చుకొని.. మంచి కాలేజీలో ఎంబీబీఎస్ చదవాలని లక్షలాది మంది విద్యార్థులు శ్రమిస్తుంటారు. ఇక తల్లిందండ్రుల తపన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తమ బిడ్డకు మెడిసిన్‌లో మంచి సీటు రావడం కోసం.. మంచి విద్యాసంస్థలో చేర్పించడం కోసం స్థోమతకు మించి ఖర్చుపెడుతుంటారు. ఏ ఇన్‌స్టిట్యూట్‌లో చేరితే నీట్‌లో మంచి ర్యాంక్ వస్తుందనే విషయం ఆరా తీస్తారు. ఫీజుల కోసం లక్షలాది రూపాయలు ధారపోస్తుంటారు.


కానీ ప్రస్తుతం ఉన్న కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లలో చాలా సంస్థలు.. భారీ ఎత్తున ప్రచారం చేసుకొని విద్యార్థులను తమవైపు తిప్పుకోవాలని చూసేవే. తాము సాధించిన ర్యాంకులతో 1,2,3,4.. అంటూ ప్రకటనలు గుప్పిస్తూ.. విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులను తమ సంస్థలో చేరేలా ఆకర్షిస్తాయి. వారి దగ్గర్నుంచి భారీ మొత్తం ఫీజులు వసూలు చేస్తుంటాయి. లక్షలాది రూపాయలు ఫీజులు కట్టాక ర్యాంకులు రాకపోతే.. కథ మళ్లీ మొదటికి వచ్చినట్టే.


ఒక్క మాటలో చెప్పాలంటే.. విద్య అనేది మంచి వ్యాపారం అయిపోయింది. కానీ ఇప్పటికీ కొన్ని సంస్థలు ప్రచార ఆర్భాటాలకు పోకోకుండా.. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడం కోసం శ్రమిస్తున్నాయి. బీదర్‌కు చెందిన షహీన్ విద్యాసంస్థ ఈ కోవలోకి వస్తుందని చెబుతున్నారు ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్. ఇటీవలే ఆ విద్యాసంస్థను సందర్శించిన ఆయన.. తన అనుభవాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఆయన ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన వివరాలు మీకోసం..


‘‘మీ ఎదురుగా కూర్చున్న ఈ వందమందిలో తొంభైమంది డాక్టర్లవుతారు సాబ్” అన్నాడు ఈ కింద ఫోటోలో ఉన్నాయన. నేను నమ్మలేదు. “ఈ కాంపౌండు లో మొత్తం 1200 మంది విద్యార్థులున్నారు. స్థలాభావం వల్ల కొందరినే కూర్చోబెట్టాం. మీ ఉపన్యాసం రికార్డు చేసి అమ్మాయిల బ్రాంచికీ, మిగతా బ్రాంచీలకీ గంటలో పంపిస్తాం’’ అన్నారు.


‘వందకి తొంభైమంది డాక్టర్లు’ అంటే నిజంగానే నమ్మశక్యం కాలేదు. కానీ మూడు గంటల సెమినార్లో ‘ఫైలం ప్రోటోజోవా – పొరిఫెరా’ తేడా అన్న సాధారణ ప్రశ్న నుంచీ, ఎన్నో క్లిష్టమైన ప్రశ్నలకి వారు చాలా అవలీలగా సమాధానం చెప్పటం చూసి ఆయన చెప్పిన మాట నిజమే అనిపించింది.


ఆ తరువాత ఈ సంస్థ గురించి తెలుసుకున్నాను. ఈ “షహీన్” విద్యాసంస్థ బ్రాంచీలు కర్ణాటకలో పదిహేను; ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, డిల్లీ... అన్ని చోట్లా కలిపి దాదాపు ముప్ఫై దాకా ఉన్నాయి. దాదాపు ఇరవై అయిదు సంవత్సరాల క్రితం బీదర్లో 12 మంది విద్యార్థులతో స్థాపించబడింది. గత ఇరవై ఐదు సంవత్సరాల్లో “ఇరవై ఐదువేల మంది” విద్యార్థులని మెడికల్ కాలేజీలకి పంపించింది.


తెలుసుకోవలసిన ఏమిటంటే, నీట్ రిజల్ట్స్ తొందర్లో వస్తాయనగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ మొదలైన ప్రాంతాలనుంచి ప్రఖ్యాత విద్య సంస్థల ఏజెంట్లు బీదర్ వచ్చి ఈ విద్యార్థుల చుట్టూ చేరతారు. ‘ఈ ర్యాంక్’ వస్తే ఇంత అని ర్యాంక్‌ని బట్టి డబ్బులు ముందే మాట్లాడుకుంటారు. ఈ రేట్ పాతిక లక్షల నుంచి రెండు కోట్ల వరకూ పలుకుతుంది. రిజల్ట్స్ వచ్చిన రోజు మీరు టీవీల్లోనూ పేపర్లలోనూ చదివే(వినే) ప్రకటనలన్నీ ఇలా వచ్చిన సంస్థలవే. విద్యార్థులు మాత్రం షహీన్‌కి సంబంధించిన వారు.


కరేస్పాండెంట్ గారు తమ కాలేజీ విద్యార్థుల ఫోటోలూ, ఆ సంస్థల ప్రకటనలలో ఫోటోలూ పక్కపక్కన పెట్టి చూపించినప్పుడు “మీరు ఎందుకు చర్య తీసుకోరు?” అని అడిగాను. “వారిలో చాలామంది బీదవారు సార్. డబ్బు వస్తూంటే ఎందుకు కాదనటం?” నవ్వుతూ అన్నారు. ఈ చేదు సత్యం చాలా మందికి తెలిసినదే అయినా, మన పిల్లల తల్లిదండ్రులకి ఈ విషయం వివరంగా చెప్పటానికే ఈ పోస్టు అంటూ యండమూరి వీరేంద్రనాథ్ ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa