నిరసన వ్యక్తంచేయడానికి నిరసనకారులు అనేక మార్గాలను ఎంచుకొంటారు. తాజాగా బెంగళూరులో రోడ్లు బాగోలేవంటూ స్థానికులు వినూత్నంగా నిరసన తెలిపారు. రోడ్లపై గుంతల కారణంగా నిరంతరం ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రాణాలు పోతున్నాయని ‘యమ ధర్మరాజు’ వచ్చినట్టుగా అభినయిస్తూ.. ఆందోళన వ్యక్తం చేశారు. యమ ధర్మరాజు వేషంలో ఒక వ్యక్తి దున్నపోతును కూడా పట్టుకుని ఆ రోడ్లపై తిరుగుతుండటం ఆసక్తి రేపింది.
బెంగళూరులోని అంజన్ పురా, కనకపురా రోడ్ ప్రాంతాల్లో రోడ్లు ఏమాత్రం బాగోలేవంటూ స్థానికులు కొంతకాలంగా మొత్తుకుంటున్నారు. దీనిపై ఎన్నిసార్లు కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా లాభం లేదంటూ తాజాగా చేంజ్ మేకర్స్ అనే స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. ఓ వ్యక్తికి యమ ధర్మరాజు వేషం వేయించి, దున్నపోతుతో సహా వచ్చినట్టుగా.. ఆయా ప్రాంతాల్లో రోడ్లపై తిరిగారు.
‘‘యముడు రోడ్లపై తిరుగుతున్నాడని ఆశ్చర్యపోతున్నారా? ఇక్కడి స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేషన్ అధికారులు ఇక్కడి ప్రజల ప్రాణాలను తీసుకెళ్లాలని యమ ధర్మరాజుకు టెండర్ ఇచ్చారు. అందుకే యముడు ఇక్కడే తిరుగుతున్నాడు..” అంటూ విమర్శించారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే, అధికారులు స్పందించి తమ రోడ్లను బాగు చేయాలని డిమాండ్ చేశారు.