ప్రభుత్వ స్కూళ్లను విలీనం చేయడంతో విద్యార్థులకు తరగతి గదులు సరిపోవడం లేదు. దీంతో ఒకే గదిలో రెండు నుంచి మూడు తరగతుల విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది అని టీడీపీ యువ నాయకులూ నారా లోకేష్ తెలియజేసారు. పాఠశాలల విలీన ప్రక్రియ మీద ఆయన మాట్లాడుతూ... గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండల పరిధిలోని గొట్టిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సమీపంలో ఉన్న స్కూళ్లను విలీనం చేశారు. ఆ పాఠశాలలో సరిపడినన్ని గదులు లేకపోవడంతో ఒకే గదిలో మూడు తరగతులను నడుపుతున్నారు. అటు, ఇటు గోడలకు రెండు బోర్డులు, మధ్యలో ప్రత్యేకంగా స్టాండ్ బోర్డు ఏర్పాటు చేసి బోధన చేస్తున్నారు. అయితే, ఈ మూడు తరగతులకు చెందిన విద్యార్థులు 30 మంది మాత్రమే ఉండటంతో కూర్చోవడానికి ఇబ్బంది లేకపోయినప్పటికీ, పాఠ్యాంశాల బోధనలో ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యలకు తోడు పాఠశాలను శుభ్రం చేసే బాధ్యత కూడా విద్యార్థులపై పడింది. అన్ని తరగతులతో పాటు పాఠశాల ప్రాంగణాన్ని కూడా విద్యార్థులే శుభ్రం చేస్తున్నారు.
పాఠశాలలో స్వీపర్లు కాని, అటెండర్ కాని లేకపోవడంతో విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు. ఈ పాఠశాలకు రెండు సంవత్సరాల కిందట రెండు అదనపు గదులను కేటాయించారు. ఆర్ఎంఎస్ఏ గ్రాంటు నుంచి రూ.10లక్షలు మాత్రమే విడుదల కావడంతో కాంట్రాక్టర్ అంతవరకు పనిచేసి వదిలి వేశారు. ఇదిలాఉండగా, గొట్టిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గనికపూడి అప్పర్ ప్రైమరీ స్కూలను విలీనం చేశారు. అక్కడి నుంచి సుమారు 80మంది విద్యార్థులు గొట్టిపాడు స్కూల్ కు వస్తున్నారు. ఈ గ్రామాల మధ్య ఎలాంటి వాహన సదుపాయాలు లేవు. దీంతో విద్యార్థులు 3 కిలోమీటర్ల దూరం నడిచి వస్తున్నారు. కాగా, సిబ్బంది కొరత కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్న మాట వాస్తవమేనని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనూరాధ తెలిపారు. స్వీపర్, అటెండర్, నైట్ వాచ్మన్లను నియమించలేదన్నారు. దీంతో విద్యార్థులే పనులు చేయాల్సి వస్తోందని వివరించారు.