ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా టెట్ అభ్యర్థులకు రాష్ట్ర సరిహద్దులు దాటి ఇతర రాష్ట్రాలైనా తెలంగాణ లాంటి సుదూర ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు నిర్వహించడం ద్వారా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని మైదుకూరు నియోజకవర్గ ఏఐవైయఫ్ నాయకులు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. నిబంధన ప్రకారం సంవత్సరానికి రెండుసార్లు నిర్వహించాల్సిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ రాజకీయ కారణాల వల్ల ప్రభుత్వాలు ఆలస్యం చేస్తూ ఇప్పటికి ఐదు సంవత్సరాలకు పైగా గడుస్తున్న నేపథ్యంలో టెట్ అభ్యర్థులకు తీవ్ర అసంతృప్తి కలిగే విధంగా చేయడం చాలా బాధాకరం.
పరిపాలన పరంగా ప్రజల రాకపోకలు జరపటానికి ఇబ్బందికరంగా ఉందని భావించి, తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎటువంటి సంబంధం లేదు అనే విధంగా రాష్ట్రాన్నే విభజించిన వాళ్ళు ఇప్పుడు పొరుగు రాష్ట్రాల్లో అభ్యర్థులకు పరీక్ష కేంద్రాలు కేటాయిస్తే వారి ఖర్చులు ఎవరు భరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తక్షణమే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్ష రాయబోయే అభ్యర్థులందరికీ న్యాయం చేసే విధంగా ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకోవాలన్నారు, లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా టెట్ అభ్యర్థులను ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయడానికి ఏమాత్రం వెనుకాడబోమన్నారు.