కొందరికి మంచంపై పడుకోగానే నిద్రలోకి జారుకుంటారు. అలాంటి వారిని నిజంగానే అదృష్టవంతులుగా భావించాలి. ఎందుకంటే చాలా మంది నిద్రలోకి జారుకోవడానికి చాలా శ్రమిస్తారు. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు ఇందుకు ప్రధాన కారణం. భారీగా ఆహారం తినడం వల్ల జీర్ణ సమస్యలు, టీ లేదా కాఫీ వల్ల నిద్రలేమి సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఈ సమస్య చాలా కాలంపాటు కొనసాగితే జీవన విధానంలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. నిద్రలేమి నుంచి ఉపశమనం పొందడానికి రాత్రి పడుకునే ముందు చేసే భోజనంలో ఈ పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. పసుపు పాలు తీసుకోవడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఇమ్యూనిటీని పెంచడంతో పాటుగా.. ఇన్ఫెక్షన్ నుంచి రక్షిస్తుంది. రాత్రి పడుకునే ముందు ఈ పాలు తాగడం ద్వారా త్వరగా నిద్రలోకి జారుకునే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇందులో ఉన్న పదార్థాలు ఆందోళన స్థాయిని తగ్గించడానికి ఉపయోగపడతాయి.
చాలా మంది రాత్రి పూట తీసుకునే ఆహారంలో మాంసం ఉండకుండా జాగ్రత్త పడతారు. మాంసం తింటే జీర్ణక్రియ సమస్యలు వస్తాయని భావిస్తారు. కానీ నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నవారు.. వారి రాత్రిపూట భోజనంలో చికెన్ ఉండేలా చూసుకుంటే వారి సమస్యను కొద్దిగా తగ్గించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఎందుకంటే మాంసంలో ఉండే ట్రిఫ్టోఫాన్, అమైనో ఆమ్లాలు త్వరగా నిద్రపోవడానికి సహకరిస్తాయి. మాములుగా బియ్యంలో కార్పొహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి నిద్రలోకి జారుకోవడానికి సహాయపడతాయి. అయితే రాత్రిపూట విందులో బియ్యంతో వండిన పదార్థాలు ఉంచగలిగితే నిద్ర సమస్యలు తక్కువగా ఉంటాయి. రాత్రిపూట అన్నం తినేవారికి చాలా బాగా నిద్రపడుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. చికెన్‌లో మాదిరిగానే అరటిలో ట్రిప్టోఫాన్, అమైనో ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి నిద్రలోకి జారుకోవడానికి సహాయపడతాయి. రాత్రిపూట తీసుకునే ఆహారంలో అరటి పండు ఉండేలా చూసుకోవాలి. అయితే పడుకునే సమయానికి రెండు గంటల ముందు ఇది తీసుకోవడం మంచిది.