యావత్తు ప్రపంచాన్ని పట్టిపీడుస్తున్న సమస్య ఉగ్రవాదం. ఇదిలావుంటే అల్ ఖైదా చీఫ్ అల్ జవహరిని అమెరికా అంతమొందిచడంపై ఆ దేశ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పందించారు. అప్ఘనిస్థాన్‌లో యుద్ధం లేకుండానే ఉగ్రవాదం రూపుమాపొచ్చనడానికి అల్ జవహరి మరణమే ప్రత్యక్ష సాక్ష్యమని అన్నారు. 9/11 దాడుల్లో కీలక సూత్రధారి, బిన్ లాడెన్ ఉగ్రవాద వారసుడు ఎట్టకేలకు 20 ఏళ్ల తర్వాత హతమయ్యాడంటూ ఒబామా ట్వీట్ చేశారు.
అప్ఘన్ రాజధాని కాబూల్‌లో జూలై 31వ తేదీ తెల్లవారుజామున అమెరికా జరిపిన డ్రోన్ దాడుల్లో అల్ ఖైదా చీఫ్ అల్ జవహరి హతమయ్యాడు. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధికారికంగా ప్రకటించారు. ఈ దాడుల్లో పౌరులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా కేవలం జవహరినే టార్గెట్ చేసి అమెరికా సక్సెస్ అయింది. ఒసామా బిన్ లాడెన్ హతమైన తర్వాత నుంచి 11 ఏళ్లుగా అల్ జవహరి అల్ ఖైదా చీఫ్‌గా ఉన్నాడు.
అల్ జవహరిని హతమార్చిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, అతని కోసం దశాబ్దాలుగా పనిచేస్తున్న ఇంటెలిజెన్స్ సభ్యులకు ఒబామా అభినందనలు తెలిపారు. యుద్ధం లేకుండానే ఉగ్రవాదాన్ని రూపుమాపడం సాధ్యమని జవహరి మరణం రుజువు చేసిందన్నారు. 9/11 దాడిలో, అల్ ఖైదా చేతిలో మరణించిన ఆత్మలకు జవహరి మరణంతో కొంతైనా శాంతి చేకూరుతుందని ఆశిస్తున్నానంటూ ఒబామా ట్వీట్ చేశారు.
అప్ఘన్‌లో దాడిని తాలిబన్ ప్రతినిధులు కూడా ధ్రువీకరించారు. కాబూల్‌లో సీఐఏ జరిపిన డ్రోన్ స్ట్రైక్‌లో జవహరి మరణించాడని జబివుల్లా ముజాహిద్ ట్విటర్‌లో తెలిపారు. ఇది కచ్చితంగా అంతర్జాతీయ నియమాలను ఉల్లంఘించడమే అని.. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు.