ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డ్రోన్‌ సహాయంతో ప్రమాదకర ఉగ్రవాదిని హతమార్చిన అమెరికా

international |  Suryaa Desk  | Published : Tue, Aug 02, 2022, 05:38 PM

ఓ ప్రమాదకర ఉగ్రవాదిని అమెరికా డ్రోన్‌ సహాయంతో హతమార్చింది. 9/11 దాడుల సూత్రధారులను పక్కా వ్యూహంతో అగ్రరాజ్యం అమెరికా మట్టుబెడుతోంది. తాలిబన్‌ల అడ్డా అఫ్గనిస్థాన్‌లో సురక్షితంగా ఉన్న అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ అగ్రనేత అయామన్ అల్‌-జవహిరీని తాజాగా మట్టుబెట్టింది. అత్యంత భారీ రక్షణ వలయంలో ఉండే జవహరీని హతమార్చేందుకు సుదీర్ఘకాలం పాటు ఎంతో ఓపిగ్గా అమెరికా నిఘా సంస్థ సీఐఏ వేచి చూసింది. అదును చూసి రహస్య ఆయుధంతో దాడి చేసి ప్రతీకారం తీర్చుకుంది. ఏం జరుగుతుందో తాలిబన్లు తేరుకునేటప్పటికే జవహిరీని మట్టుబెట్టి ఆ ప్రాంతం నుంచి డ్రోన్లు అదృశ్యమయ్యాయి. ఈ ప్రతీకారం కోసం అమెరికా దాదాపు 20 ఏళ్లుగా ఎదురు చూస్తోంది.


అమెరికా కాలమానం ప్రకారం శనివారం రాత్రి 9.49 గంటలకు సీఐఏకు చెందిన డ్రోన్లు క్షిపణులతో అల్‌ఖైదా అగ్రనేత అల్‌-జవహిరీపై దాడి చేసి హతమార్చారు. జవహరీ తన ఇంటి బాల్కనీలో నిలబడి ఉన్న సమయంలో ఈ దాడి జరిగింది. గతంలోనూ దాడుల నుంచి జవహిరీ పలు మార్లు తప్పించుకోవడంతో ఈసారి మాత్రం అటువంటి అవకాశాన్ని సీఐఏ ఇవ్వలేదు. వాటిని దృష్టిలో పెట్టుకొని ఆపరేషన్‌ కోసం సీఐఏ సుదీర్ఘ వ్యూహరచన చేసి అమలు చేసింది. అల్‌ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్‌ లాడెన్‌ను హతమార్చిన 11 ఏళ్ల తర్వాత జవహరీని మట్టుబెట్టడం గమనార్హం.


బిన్ లాడెన్‌ హతమైన తర్వాత అల్‌ ఖైదా పగ్గాలను జవహిరీ స్వీకరించగా.. ఆ తర్వాత కొద్ది రోజులకే అతడి కుటుంబం మధ్యప్రాశ్చ్యంలోని ఓ సురక్షిత ప్రాంతానికి తరలివెళ్లినట్లు సీఐఏ వర్గాలు గుర్తించాయి. కానీ, వాళ్లు ఏ ప్రదేశంలో ఉన్నారనేది మాత్రం కచ్చితంగా తెలియరాలేదు. ఈ నేపథ్యంలో రెండేళ్ల కిందట 2020లో జవహరీ అనారోగ్యంతో చనిపోయినట్టు అంతర్జాతీయ మీడియాలో ప్రచారం సాగింది. ఇది నమ్మశక్యంగా లేకపోవడంతో నిఘా సంస్థలు శంకించాయి. ఆ తర్వాత 2021లో 9/11 దాడులకు 20 ఏళ్లు పూర్తైన సందర్భంగా జవహిరీ మాట్లాడుతున్న వీడియో బయటకు రావడంతో ఉలిక్కిపడ్డాయి.


జెరూసలెంను ఎట్టి పరిస్థితుల్లో యూదులకు దక్కనీయబోయమని ప్రకటించిన అల్-ఖైదా చీఫ్.. అదే సమయంలో ట్విన్‌ టవర్స్‌పై దాడులనూ ప్రశంసించాడు. అయితే.. ఆ వీడియోలో అతడు ఎక్కడ ఉన్నాడో ఎటువంటి ఆధారాలు లభించలేదు. చివరకు ఈ వీడియో విడుదల చేసిన ఏడు నెలల తర్వాత అమెరికా నిఘా సంస్థలకు జవహిరీ ఆచూకీ లభించడం మొదలైంది. భార్య, కుమార్తె, మనవరాలితో అతడు కాబూల్‌లోని ఓ భవనంలో తలదాచుకుంటున్నట్టు పక్కా సమాచారం లభించింది.


ఆ భవంతిలో ఉండే వ్యక్తి జవహిరీ అనే నిర్ధారించుకున్నాయి. దీంతో ఇంటిని పోలిన నమూనాను రూపొందించి దానిని శ్వేతసౌధంలోని సిచ్యువేషన్‌ రూమ్‌కు తీసుకొచ్చారు. ఆ ఇంటిపైనే దాడి చేయాలని నిర్ణయించారు. దాడి సమయంలో సాధారణ పౌరులు, జవహిరీ కుటుంబసభ్యులకు ప్రమాద తీవ్రతను తగ్గించాలనే ఉద్దేశంతో ముందు సిమ్యులేషన్ నిర్వహించారు. జవహిరీ అప్పుడప్పుడు బాల్కనీలో కూర్చుంటున్నట్టు గమనించారు. ఈ దాడికి సంబంధించిన పూర్తి ప్రణాళిక అమెరికా అత్యున్నత స్థాయి అధికారుల్లో అతి కొద్ది మందికి మాత్రమే తెలియడం గమనార్హం. ఈ నేపథ్యంలో నిఘా బృందంలోని ఒక అధికారిని జవహిరీ దినచర్యను గమనించేందుకు ప్రత్యేకంగా నియమించారు.


జులై 1న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు సిచ్యువేషన్ రూమ్‌లో ఆపరేషన్ గురించి వివరించారు. జులై 31 న జవహిరీ ఒంటిరిగా బాల్కనీలో నిలబడి ఉండగా.. అతడేనని ప్రత్యేక అధికారి నిర్ధారించారు. దీంతో వెంటనే.. సీఐఏకు చెందిన డ్రోన్‌.. రెండు హెల్‌ఫైర్‌ క్షిపణులను ప్రయోగించింది. తాలిబన్ల ప్రభుత్వం కూడా ఈ దాడిని ధ్రువీకరించింది. కానీ, హతమైన వ్యక్తుల వివరాలను మాత్రం వెల్లడించలేదు.


కొన్ని నెలలు పరిశీలన తర్వాత కాబూల్ సేఫ్ హౌస్‌లో జవహిరీ ఉన్నాడని మరింత విశ్వాసం పెంచుకున్నారు. ఏప్రిల్ ప్రారంభంలో సీనియర్ అడ్మినిస్ట్రేషన్ అధికారులకు సమాచారం అందజేయగా.. జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ ఆ తర్వాత అధ్యక్షుడు జో బిడెన్‌కు ఈ విషయం తెలియజేశారు. ఆపరేషన్‌ కోసం బహుళ స్వతంత్ర సమాచార వనరుల ద్వారా నమూనాను రూపొందించగలిగామని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.


జవహిరీని మట్టుబెట్టే ఆపరేషన్‌కు అవసరమైన ఆయుధం ఎంపికలో కూడా అమెరికా అత్యంత జాగ్రతలు తీసుకుంది. భారీ పేలుళ్లకు అవకాశం లేకుండా హెల్‌ఫైర్‌ ఆర్ 9 ఎక్స్ మోడల్‌ క్షిపణిని ఎంపిక చేసింది. 100 పౌండ్ల బరువైన ఈ క్షిపణిలో ప్రత్యేకంగా వార్‌హెడ్‌ ఉండదు. కానీ, దీనికి అత్యంత శక్తిమంతమైన ఆరు బ్లేడ్‌లు ఉంటాయి. ఇవి లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరుకుంటాయి.. ప్రత్యేకంగా పేలుడు ఉండదు. 2017లో అల్‌ఖైదా సీనియర్‌ నేత అబుబకర్‌ అల్‌ ఖయర్‌ అల్‌ మస్రిని హతమార్చడానికి ఈ ఆయుధాన్నే వినియోగించారు. దాడి సమయంలో మస్రి సిరియాలో కారులో ప్రయాణిస్తుండగా దాడి చేశారు. ఈ దాడిలో కారు మధ్యభాగంలో మాత్రమే రంధ్రమైనట్లు ఫొటోలు బయటకు వచ్చాయి. ఆ తర్వాత అమెరికా పలు ఆపరేషన్ల కోసం దీనిని వినియోగించింది.


2000 సంవత్సరంలో అమెరికా నౌక యూఎస్‌ఎస్‌ కోలేపై దాడికి పాల్పడిన ఉగ్రవాది జమాల్‌ అల్‌ బద్విని కూడా 2019లో ఈ ఆయుధంతోనే మట్టుబెట్టింది. వీటిని ‘నింజా బాంబ్స్‌’ లేదా ‘ఫ్లయింగ్‌ జిన్సూ’ అని కూడా పిలుస్తారు. ఒబామా హయాంలో సాధారణ పౌరుల ప్రాణాలకు హాని జరగకుండా ఆపరేషన్లు నిర్వహించేందుకు దీనిని అభివృద్ధి చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com