దేశ ఆస్తులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం తమ సంపన్న స్నేహితులకు దోచిపెడుతోందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. అంతేకాదు "రూ.1053కే సిలిండర్ ఎందుకు..? పెరుగు, తృణ ధాన్యాలపై జీఎస్టీ ఎందుకు ? 200 రూపాయలకు మస్టర్డ్ ఆయిల్ ఎందుకు..? ద్రవ్యోల్బణం, నిరుద్యోగంపై ప్రశ్నలు అడిగినందుకు రాజు 57 మంది ఎంపీలను అరెస్ట్ చేశారు. 23 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు." అని కేంద్రాన్ని ప్రశ్నిస్తూ రాహుల్ హిందీలో ట్వీట్ చేశారు.
నిరుద్యోగం, ద్రవ్యోల్బణంపై ప్రశ్నలు అడిగినందుకు 57 మంది ఎంపీలను అరెస్ట్ చేయగా.. 23 మందిని సస్పెండ్ చేశారని అన్నారు. అంతేకాదు అహంభావంతో కళ్లు మూసుకుపోయిన బీజేపీ ప్రభుత్వానికి దేశంలో ఎగబాకిన ద్రవ్యోల్బణం కనిపించడం లేదని ఆరోపించారు. లోక్‌సభలో ధరల పెరుగుదలపై చర్చ అనంతరం రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.
సభలో భారత దేశం ఆర్థిక మాద్యంలోకి పడిపోయే ప్రసక్తే లేదని, ద్రవ్యోల్బణం మాటే లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బదులిచ్చారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ ఈ కామెంట్లు చేశారు. దేశంలో ద్రవ్యోల్బణం లేదని, నిరుద్యోగం, ఆర్థిక మాంద్యం లేదని బీజేపీ పాలకులు చెబుతున్నారని, కాషాయ పాలకుల కళ్లు అహంభావంతో మూసుకుపోవడంతో వారికి ధరల పెరుగుదల ఎక్కడ కనిపిస్తుందని ఆయన ట్వీట్ చేశారు. అలాగే అహంభావ ధోరణితో ఉన్నరాజు ప్రతిష్టను అలాగే ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం వేలాది కోట్లు వెచ్చిస్తోందని రాహుల్ గాంధీ విమర్శించారు.