సీఎం జగన్ రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. రేపు సీఎం జగన్ ఢిల్లీ వెళ్తున్నారు. మరో వైపు టీడీపీ అధినేత చంద్రబాబు రేపు ఢిల్లీకి పయణం కానున్నారు. ఇప్పటికే కేంద్రం నుంచి ఆహ్వానం అందుకున్న చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారైంది. అటు సీఎం జగన్..ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు ఇద్దరూ ఒకే సమయంలో ఢిల్లీకి వెళ్తుండటం.. ప్రధాని అధ్యక్షతన జరిగే కార్యక్రమాల్లో పాల్గొనటం ఏపీ రాజకీయాల్లో ఆసక్తి కరంగా మారింది. అయితే, ఇద్దరూ కలిసి ఒకే కార్యక్రమంలో పాల్గొంటారని భావించినా... ఇద్దరూ వేర్వేరు కార్యక్రమాలకు హాజరు కానున్నట్లు సమాచారం.
ముఖ్యమంత్రి జగన్ రేపు మధ్నాహ్నం గన్నవరం నుంచి బయల్దేరి విశాఖ చేరుకుంటారు. అక్కడి నుంచి శ్రీకాకుళం జిల్లాకు వెళ్తారు. స్పీకర్ తమ్మినేని సీతారం కుమారుడు వివాహానికి హాజరవుతారు. ఆ తరువాత విశాఖ నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా.. ప్రధానితో పాటుగా అమిత్ షా.. నిర్మలా సీతారామన్..గజేంద్ర సింగ్ షెకావత్ అప్పాయింట్ మెంట్ కోరారు. రేపు ఉపరాష్ట్రపతి ఎన్నిక ఉండటంతో..రేపు రాత్రి లేదా ఆదివారం సమావేశాలు జరిగే అవకాశం ఉంది. 7వ తేదీన నీతి అయోగ్ పాలకమండలి సమావేశం జరగనుంది. ఆ సమయంలో ప్రధాని మరోసారి ఏపీకి ప్రత్యేక హోదాతో పాటుగా ప్రధానంగా పోలవరం అంశాన్ని ప్రస్తావించేందుకు సిద్దం అవుతున్నారని తెలుస్తోంది.