ఢిల్లీ కేంద్రంగా ఏపీ రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తికర చర్చ సాగుతోంది. దీనికి కారణం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జాతీయ కమిటీ సమావేశానికి హజరైన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుతో ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ ఏకాంతంగా భేటీ కావడమే. ఈ సందర్భంగా ఇరువురు నేతలు 5 నిమిషాల పాటు చర్చించుకున్నారు. వీరి చర్చల్లో ఏఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయన్న విషయంపై ఆసక్తి నెలకొంది. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తి అవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట భారీ కార్యక్రమానికి తెరదీసిన సంగతి తెలిసిందే. ఈ ఉత్సవాలపై శనివారం రాష్ట్రపతి భవన్ వేదికగా నిర్వహించిన జాతీయ కమిటీ భేటీకి చంద్రబాబుకు కూడా ఆహ్వానం అందింది.
కేంద్రం ఆహ్వానాన్ని మన్నించిన చంద్రబాబు శనివారం ఉదయం ఢిల్లీ వెళ్లారు. రాష్ట్రపతి భవన్‌లో సాయంత్రం జరిగిన ఈ భేటీలో చాలా కాలం తర్వాత మోదీ, చంద్రబాబులు ఒకే వేదికపై కనిపించారు. భేటీ ముగిశాక అందరూ వెళుతున్న సమయంలో చంద్రబాబుతో మోదీ ఏకాంతంగా భేటీ అయ్యారు.