అల్ ఖైదాపై పోరులో పాకిస్థాన్ మరోసారి అమెరికా చేతిలో పావుగా మారుతోందా? అని పాకిస్థాన్ విపక్ష తెహ్రీకే ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ నేత ఫవాద్ చౌదరి ప్రశ్నించారు. అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ అధినేత అయిమాన్ అల్ జవహరిని అమెరికా ఇటీవల డ్రోన్ దాడితో హతమార్చిన సంగతి తెలిసిందే. ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ లో తన నివాసంలోని బాల్కనీలో నిలుచుని ఉండగా, అమెరికా డ్రోన్ రెండు హెల్ ఫైర్ ఆర్9ఎక్స్ క్షిపణులతో జవహరి కథ ముగించింది. అయితే, అమెరికా తన డ్రోన్ ను ఎక్కడ్నించి ఆఫ్ఘన్ గగనతలంలోకి పంపించిందన్న దానిపై స్పష్టత లేదు.
ఈ నేపథ్యంలో, పాకిస్థాన్ విపక్ష తెహ్రీకే ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ నేత ఫవాద్ చౌదరి స్పందించారు. అమెరికా జవహరిని హతమార్చేందుకు పాకిస్థాన్ గగనతలాన్ని ఉపయోగించుకుందా? అంటూ సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనిపై పాక్ కేంద్రమంత్రివర్గం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అల్ ఖైదాపై పోరులో పాకిస్థాన్ మరోసారి అమెరికా చేతిలో పావుగా మారుతోందా? అని కూడా ఫవాద్ చౌదరి ప్రశ్నించారు. అంతకుముందు, జవహరిపై డ్రోన్ దాడికి పాకిస్థాన్ గగనతలాన్ని ఉపయోగించుకున్నారన్న ఆరోపణలను పాక్ సైన్యం తోసిపుచ్చింది. ఇలాంటి చర్యల కోసం పాక్ గగనతలాన్ని ఉపయోగించుకునే ప్రసక్తేలేదు అని సైన్యం స్పష్టం చేసింది.