శామ్ సంగ్ గెలాక్సీ నూతన ఆవిష్కరణ త్వరలో మార్కెట్ లోకి రానున్నది. శామ్ సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4 ఈ నెల 10న విడుదల కానుంది. శామ్ సంగ్ గెలాక్సీ అన్ ప్యాక్డ్ ఈవెంట్ 2022 కార్యక్రమం ఇందుకు వేదిక కానుంది. ఈ ఫోన్ కు సంబంధించి అమెజాన్ నెదర్లాండ్స్ లో వివరాలు దర్శనమిచ్చాయి. గూగుల్ క్యాచ్డ్ వ్యూ ద్వారా దీన్ని చూడొచ్చు. దీంతో ఈ ఫోన్ డిజైన్, స్పెసిఫికేషన్ వివరాలు బయటకు వచ్చాయి.
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12ఎల్ ఓఎస్ తో రానుంది. టాబ్లెట్లు, ఫోల్డబుల్ ఫోన్ల కోసం రూపొందించినదే ఆండ్రాయిడ్ 12ఎల్. గెలాక్సీ జెడ్4 ఫోల్డబుల్ ఫోన్ అని తెలిసిందే. ఫోన్ ను మూసేసినప్పుడు పైన స్క్రీన్ సైజు 6.2 అంగుళాల పరిమాణంలో ఉంటుంది. తెరిచినప్పుడు స్క్రీన్ సైజు 7.6 అంగుళాలుగా ఉంటుంది. ఫోన్ బయటి డిస్ ప్లే 23.1:9 యాస్పెక్ట్ రేషియోతో ఉంటుంది. జెడ్3 ఫోల్డబుల్ ఫోన్ లో ఉన్న 25:9 యాస్పెక్ట్ రేషియోతో పోలిస్తే విశాలంగా ఉంటుంది. డైనమిక్ ఆమోలెడ్ 2ఎక్స్ డిస్ ప్లే ప్యానెల్ తో, 120 హెర్జ్ రీఫ్రెష్ రేటుతో వస్తుంది. క్లోజ్ చేసి ఉంచినప్పుడు ఫోన్ 15.8 ఎంఎం మందంతో ఉంటుంది. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 '16ఎంఎం' స్థాయిలోనే ఉంటుందని తెలుస్తోంది.
గోల్డ్ కలర్ ప్రీమియం ఫినిష్ తో ఉన్న ఫొటో బయటకు వచ్చింది. మిడ్ నైట్ బ్లూ వేరియంట్ కూడా ఇందులో ఉంది. ఈ ఫోన్ బరువు 263 గ్రాములు ఉండనుంది. 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజీ తో రానున్న దీని ధర, ఇతర విశేషాలు ఈ నెల 10న తెలియనున్నాయి. అదే రోజు గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4, గెలాక్సీ వాచ్ 5, గెలాక్సీ బడ్స్ ను కూడా శాంసంగ్ విడుదల చేయనుంది.