చైనా నేడు ప్రపంచ వ్యాప్తంగా అగ్రదేశాలకు ధీటుగా ఎదిగే ప్రయత్నం చేస్తోంది. అమెరికాను దాటేసి ప్రపంచ శక్తిగా ఎదగాలని ఉవ్విళ్లూరుతోన్న చైనా.. అందుకు తగ్గట్టుగా చాలా ఏళ్ల క్రితం నుంచే ప్రణాళికలను అమలు చేస్తోంది. 9 ఏళ్ల క్రితం చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ‘బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్ఐ)’ని ప్రారంభించారు. దీన్నే ఇంతకు ముందు వన్ బెల్ట్ వన్ రోడ్ పేరుతో పిలిచేవారు. అంతర్జాతీయంగా మౌలిక వసతుల కల్పన ఉద్దేశంతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టులో భాగంగా చైనా దాదాపు 70 దేశాలు, అంతర్జాతీయ సంస్థల్లో పెట్టుబడులు పెట్టింది. సిల్క్ రోడ్ ఎకనమిక్ బెల్ట్ అని కూడా పిలిచే ఈ ఇనిషియేటివ్‌లో భాగంగా.. చైనా నుంచి మధ్య ఆసియా మీదుగా యూరప్‌కు రోడ్డు, రైలు మార్గాలను ఏర్పాటు చేయడంతోపాటు.. ఇండో-పసిఫిక్ సముద్ర మార్గాల్లోనూ పోర్టుల నిర్మాణాన్ని చైనా చేపట్టింది. ఇప్పటి వరకూ 149 దేశాలు బీఆర్ఐలో చేరేందుకు సంతకాలు చేశాయి.
ఇదిలావుంటే కరోనా కారణంగా చైనా పెట్టుబడులు పెట్టలేకపోవడంతో.. ఇటీవలి కాలంలో బీఆర్ఐ విషయంలో బీజింగ్ ప్రణాళికలు అమలు కావడం లేదు. చైనా తీసుకున్న జీరో కోవిడ్ పాలసీ నిర్ణయాల కారణంగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది.. చైనా ఎకానమీపై ప్రతికూల ప్రభావం పడింది.. దీంతో బీఆర్ఐలో పెట్టుబడులు పెట్టలేని పరిస్థితిని చైనా ఎదుర్కొంటోంది.
బీఆర్ఐ ఇలా మారిపోవడానికి డ్రాగన్‌కు ప్రపంచ దేశాలు మెల్లగా దూరం అవుతుండటం కూడా ఓ కారణం. పెట్టుబడుల పేరిట చిన్న చిన్న దేశాలను తన వైపు తిప్పుకుంటున్న చైనా.. ఆ దేశాలు అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి కారణం అవుతోంది. ఇటీవలి శ్రీలంక ఆర్థిక మాంద్యానికి చైనా నుంచి ఎడాపెడా తెచ్చిన అప్పులు ప్రధాన కారణమనే సంగతి తెలిసిందే. శ్రీలంక పరిణామాల నేపథ్యంలో బంగ్లాదేశ్, నేపాల్ లాంటి దేశాలు అప్రమత్తం అవుతున్నాయి.