కొవిడ్ రక్కసిపై 'మహోజ్వల విజయం' సాధించాం అని ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ వెల్లడించారు. దాదాపుగా ప్రపంచంలోని అన్ని దేశాలపైనా కొవిడ్ మహమ్మారి విరుచుకుపడింది. ఉత్తర కొరియా కూడా దీని బారినపడి విలవిల్లాడినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ ఆసక్తికర ప్రకటన చేశారు. కొవిడ్ రక్కసిపై 'మహోజ్వల విజయం' సాధించాం అని వెల్లడించారు. గత రెండు వారాలుగా దేశంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని ఉత్తర కొరియా అధికారులు కిమ్ కు నివేదించారు.
ఈ నేపథ్యంలో కిమ్ ఆరోగ్య కార్యకర్తలు, శాస్త్రవేత్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "విజయం సాధించాం... ప్రాణాంతక కరోనా రక్కసిని తుదముట్టించాం" అని ప్రకటన చేశారు. ఈ క్రమంలో ఆయన సమావేశానికి హాజరైన సిబ్బంది, సీనియర్ అధికారులతో ఫొటోలు దిగారు. కరోనా వ్యాప్తి మొదలయ్యాక ఉత్తర కొరియాలో 48 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. అధికారిక మీడియా కేసీఎన్ఏ ప్రకారం గత ఏప్రిల్ వరకు కరోనాతో 74 మంది మరణించారు.